ARTICLE AD
Love Fraud : ప్రేమ పేరుతో యువతి మోసానికి పాల్పడింది. ప్రియుడిని నమ్మించి రూ.16 లక్షలతో ఉడాయించింది. ప్రియురాలి మోసంతో మనస్థాపం చెందిన ప్రియుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. ప్రస్తుతం ప్రియురాలు అస్ట్రేలియాకు పారిపోగా, ప్రియుడు ప్రాణాపాయ స్థితిలో కరీంనగర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలో జరిగింది. తిమ్మాపూర్ కు చెందిన మాదన నాగరాజు, విశాఖపట్నంకు చెందిన దమ్ము కమల అలియాస్ సంధ్యా అలియాస్ ప్రియాంక ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుంటానని నాగరాజును నమ్మించి రూ.16 లక్షలతో బంగారు అభరణాలు కొనుగోలు చేయించుకుని తన అవసరాలు తీర్చుకుని పారిపోయింది.
అసలేం జరిగింది?
నాగరాజు మద్యానికి బానిసై తమిళనాడులోని కోయంబత్తూర్ లోగల ఇషా ఫౌండేషన్ లో చేరాడు. అక్కడ కమల అలియాస్ సంధ్య ప్రియాంక నాగరాజుకు పరిచయం ఏర్పడింది. వారి పరిచయం కాస్త ప్రేమగా మారి సహజీనం వరకు వెళ్లింది. కొంత కాలం గడిచాక నాగరాజు స్వగ్రామానికి చేరుకుని తిమ్మాపూర్ లో ఓ ఇల్లు అద్దెకు తీసుకున్నారు. కొద్ది రోజుల పాటు కాపురం కూడా చేశారు. పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకుని అందుకు బంగారానికి అని కొంత ఇతర అవసరాలకని కొంత దశల వారీగా రూ.16 లక్షల వసూలు చేసింది. నాగరాజును నమ్మించి ఆస్ట్రేలియాకు వెళ్లింది. వారం పదిరోజులైనా ప్రియురాలు రాకపోవడంతో మోసపోయానని గ్రహించిన ప్రియుడు నాగరాజు పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు యత్నించాడు. ప్రియురాలి మోసంతో నాగరాజు ఆత్మహత్యకు యత్నించడంతో పేరెంట్స్ ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం నాగరాజు ఆసుపత్రిలో కోలుకుంటుండగా ప్రియురాలు మాత్రం ఫోన్ చేసి తన పేరిట 2 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ చేస్తే పెళ్లి చేసుకుంటానని వేధిస్తుందని నాగరాజు పేరెంట్స్ పోలీసులను ఆశ్రయించారు.
కన్నీటిపర్యంతమవుతున్న నాగరాజు పేరెంట్స్
యువతి చేసిన మోసంతో కొడుకు ఆసుపత్రిపాలుకావడంతో నాగరాజు తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. ఇషా పౌండేషన్ లో కలిసిన యువతి ప్రేమలో పడి కొడుకు మోసపోయి ఆసుపత్రి పాలయ్యాడని కన్నీటిపర్యంతమవుతున్నారు. యువతిని ప్రేమిస్తున్నానని చెప్పినప్పుడే వద్దని వారించామని తన కొడుకు వినలేదంటున్నారు. కొడుకు ప్రేమను కాదని ఆమెను ఇంట్లోకి రానిస్తే నట్టేట ముంచిందని నాగరాజు తండ్రి మల్లయ్య ఆవేదనతో తెలిపారు. పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో తన కొడుకు రూ.16 లక్షల తీసుకెళ్లి ఆ యువతికి బంగారు ఆభరణాలు కొనివ్వడంతోపాటు నగదు ఇచ్చాడని తెలిపారు. డబ్బులు పోయినా పర్వాలేదు కానీ, కొడుకుని మోసం చేసి ఆసుపత్రిపాలు చేసిందని కన్నీటిపర్యంతమయ్యారు. మోసం చేసిన యువతిపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని మల్లయ్య వేడుకుంటున్నారు. మరొకరికి ఇలాంటి పరిస్థితి రాకుండా కఠిన చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
కేసు నమోదు చేసిన పోలీసులు
ప్రేమ పేరుతో పెళ్లి చేసుకుంటానని నమ్మించి రూ.16 లక్షలతో ఉడాయించిన ప్రియురాలిపై ప్రియుడి తండ్రి మాదన మల్లయ్య ఎల్ఎండీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మల్లయ్య పిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చేరాలు తెలిపారు. అమ్మాయిలను మోసం చేసిన ఘటనలు చూశాం కానీ, ప్రియుడిని మోసం చేసిన ఈ సంఘటన స్థానికంగా కలకలం సృష్టిస్తుంది. నాగరాజు మద్యం మత్తు మోసానికి దారితీసిందని అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు కఠిన చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
HT TELUGU CORRESPONDENT K.V.REDDY, KARIMNAGAR