Mahabubabad Crime : పెద్దల పంచాయితీకి భయపడి ప్రేమజంట ఆత్మహత్యాయత్నం- యువతి మృతి, యువకుడి పరిస్థితి విషయం

5 months ago 90
ARTICLE AD

Mahabubabad Crime : కుల పెద్దల పంచాయితీకి భయపడి ఇద్దరు ప్రేమికులు ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఉరి బిగిసి యువతి ప్రాణాలు కోల్పోగా, చావు నుంచి బయట పడిన యువకుడు కత్తితో గొంతు కోసుకుని సూసైడ్ అటెంప్ట్ చేసి ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ విషాద ఘటన మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కోటగడ్డ గ్రామంలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. గ్రామస్థులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. కోటగడ్డ గ్రామానికి చెందిన ప్రవళిక(26)కు మూడు సంవత్సరాల కిందట వేరే గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహం జరిగింది. కానీ పెళ్లి జరిగిన కొద్ది రోజులకే ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తడంతో గొడవలు జరిగాయి. దీంతో అప్పటి నుంచి ఇద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే ప్రవళికకు కోటగడ్డ గ్రామానికే చెందిన రవీందర్ తో పరిచయం పెరిగింది. ఇద్దరి మధ్య చనువు కాస్త ప్రేమగా మారగా, కొంత కాలంగా వారిద్దరూ ప్రేమించుకుంటున్నారు.

పెళ్లి చేసుకునేందుకు ఊరి నుంచి పరార్

ప్రవళిక, రవీందర్ మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తుండగా, ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ ప్రవళికకు ఇదివరకే పెళ్లి జరగగా, మళ్లీ పెళ్లంటే ఇంట్లో వాళ్లు, గ్రామ పెద్దలతో ఇబ్బందులు తలెత్తుతాయనే ఉద్దేశంతో ఇద్దరూ ఇంట్లో నుంచి రెండు నెలల కిందట పారిపోయారు. ఇరు కుటుంబాల పెద్దలకు ప్రవళిక, రవీందర్ ఆచూకీ తెలియకపోవడంతో వారిద్దరూ తప్పిపోయారంటూ బయ్యారం పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు. ఇంట్లో నుంచి వెళ్లిపోయిన ప్రవళిక, రవీందర్ ఇద్దరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం చేరుకున్నారు. అక్కడ కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇదిలా ఉంటే వారిద్దరిపై ఫైల్ అయిన మిస్సింగ్ కేసు మేరకు బయ్యారం పోలీసులు వారిని గుర్తించారు. వారం రోజుల కిందట శ్రీకాకుళం వెళ్లి ఇద్దరినీ తీసుకొచ్చి వారి వారి తల్లిదండ్రులకు అప్పగించారు.

పంచాయితీ భయంతో సూసైడ్ అటెంప్ట్

శ్రీకాకుళం నుంచి వచ్చిన అనంతరం ఇద్దరూ రవీందర్ ఇంట్లోనే ఉంటున్నారు. కాగా ఇద్దరి వ్యవహారం తేల్చేందుకు తమ కుల కట్టుబాట్ల ప్రకారం సోమవారం పంచాయితీ నిర్వహించేందుకు గ్రామ పెద్దల సమక్షంలో నిర్ణయించారు. ఈ మేరకు సోమవారం పంచాయి జరగనుండగా, పెద్ద మనుషుల నిర్ణయం తమకు అనుకూలంగా ఉంటుందో.. ఉండదోనని ప్రవళిక, రవీందర్ ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ఇద్దరూ చనిపోవాలని నిర్ణయించుకున్నారు. తమ ప్లాన్ ప్రకారం ఇద్దరూ సోమవారం ఉదయం ఉరి వేసుకున్నారు. దీంతో ప్రవళిక ఉరి బిగిసి చనిపోగా రవీందర్ మాత్రం ప్రాణాపాయ స్థితిలో బయటపడ్డాడు. దీంతో తాను ఎలాగైనా చనిపోవాలనే ఉద్దేశంతో రవీందర్ మళ్లీ కత్తితో మెడ కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీంతో ఇంట్లో అలజడిని గమనించిన రవీందర్ కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

దీంతో హుటాహుటిన సీఐ రవీందర్, ఎస్సై ఉపేందర్ ఇద్దరూ ఘటనా స్థలానికి చేరుకున్నారు. రవీందర్ ను వెంటనే 108 అంబులెన్స్ లో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ప్రవళిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మహబూబాబాద్ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రవీందర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. కాగా ఇష్టపడి పెళ్లి చేసుకున్న ప్రవళిక ప్రాణాలు కోల్పోవడం, రవీందర్ ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుండటంతో వారివారి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. కోటగడ్డ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.

(రిపోర్టింగ్: హిందూస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)

Read Entire Article