ARTICLE AD
Mahabubabad Murder: వరుసకు అక్క బావ అయ్యే దంపతుల మధ్య సయోధ్య కుదర్చడానికి వెళ్లి యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ దారుణ ఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం దుబ్బ తండాలో చోటు చేసుకుంది. స్థానికులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
మరిపెడ మండలం వెంకిటయ్య తండాకు చెందిన లక్ష్మితో దంటకుంట తండా జీపీ పరిధి దుబ్బ తండాకు చెందిన భూక్య మంత్రికి దాదాపు 20 సంవత్సరాల కిందట వివాహం జరిగింది. వారి దాంపత్య జీవితానికి ఇద్దరు కుమారులు కూడా పుట్టారు. ఇదిలాఉంటే భూక్య మంత్రి తరచు మద్యం తాగి భార్య లక్ష్మీ తో గొడవ పడేవాడు.
లక్ష్మిని బాగా కొట్టడంతో తరచుగా ఆమె తల్లిదండ్రులు, అన్నదమ్ములు సర్ది చెప్పి వచ్చేవారు. కాగా ఆదివారం రాత్రి కూడా భార్య లక్ష్మీ తో గొడవ పడిన మంత్రి ఆమెను కొట్టి ఉరి వేసి చంపడానికి ప్రయత్నించాడు. అది గమనించిన వారి చిన్న కొడుకు తమ తల్లి బంధువులకు సమాచారం ఇచ్చాడు.
వచ్చిన వాళ్లపైనా దాడి
మళ్లీ గొడవ జరిగిన విషయం తెలుసుకున్న లక్ష్మి తమ్ముడు మురళి, తల్లి నాగమ్మ, లక్ష్మి చిన్నాన్న కొడుకు గుగులోతు పాండు, అతని భార్య మంగ సోమవారం దుబ్బ తండాలోని లక్ష్మీ ఇంటికి వెళ్లారు. వారు వచ్చిన విషయం తెలుసుకున్న మంత్రి కోపంతో రగిలిపోయాడు. వాళ్లను తిడుతూ, వారిపైనే దాడికి దిగాడు. విచక్షణ మరిచి కర్రలతో విపరీతంగా దాడి చేశాడు. బీరు సీసాలతో మురళిపై దాడికి ప్రయత్నించగా ఆయన పరుగులు తీశాడు. అనంతరం గుగులోతు పాండు(35)ను మంత్రి కర్రలతో బలంగా కొట్టడంతో తల పగిలి కింద పడ్డాడు. తీవ్ర రక్త స్రావం జరగగా అక్కడికక్కడే స్పృహ కోల్పోయాడు.
ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మృతి
పాండు కింద పడిపోగానే మంత్రి అక్కడి నుంచి పరారయ్యాడు. అనంతరం పాండు భార్య మంగ తమ బంధువులకు సమాచారం చేర వేసింది. వారంతా అక్కడికి రాగానే వెంటనే కారులో ఖమ్మంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కి తీసుకుని వెళ్లారు. అక్కడ పాండును పరిశీలించిన డాక్టర్లు పరిస్థితి విషమంగా ఉందని వెంటనే హైదరాబాద్ తీసుకు వెళ్లాల్సిందిగా సూచించారు. దీంతో డాక్టర్ ల సూచన మేరకు అంబులెన్స్ లో హైదరాబాద్ తీసుకు వెళుతున్న క్రమంలో మార్గమధ్యలో పాండు ప్రాణాలు కోల్పోయాడు.
తండాలో తీవ్ర విషాదం
పాండు మరణించిన అనంతరం బాధిత కుటుంబ సభ్యులు వెంటనే మరిపెడ పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారి సూచన మేరకు డెడ్ బాడీని మహబూబాబాద్ ఏరియా హాస్పిటల్ కి తీసుకెళ్లారు. కాగా మృతుడు పాండు భార్య మంగ ఫిర్యాదు మేరకు మరిపెడ పోలీసులు కేసు నమోదు చేశారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.
మృతుడు పాండుకు కొడుకు, కూతురు ఉన్నారు. వరుసకు అక్క అయిన లక్ష్మీ కోసం వెళ్లి తన భర్త ప్రాణాలు కోల్పోవడంతో మంగ రోధించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. చేయని తప్పుకు ప్రాణాలు పోవడంతో మృతుడి బంధువులు, తండావాసుల రోదనలు మిన్నంటాయి. వెంకీటయ్య తండాతో పాటు దుబ్బతండాలో తీవ్ర విషాదం నెలకొంది.
(రిపోర్టింగ్: హిందూస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)