Mahabubabad News : భర్తకు రెండో పెళ్లి - దగ్గరుండి గ్రాండ్ గా జరిపించిన భార్య

1 month ago 58
ARTICLE AD

తన భర్తను ఓ యువతి ఇష్టపడుతున్న విషయం తెలుసుకున్న ఓ మహిళ వింత నిర్ణయం తీసుకుంది. తన భర్తను ఇష్టపడిన యువతికి తన భర్తతో రెండో వివాహం జరిపించింది. ఆమే దగ్గరుండి తన భర్తకు రెండో వివాహం జరిపించడంతో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకోగా.. ఆ వివాహిత తీసుకున్న నిర్ణయం పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

స్థానికులు తెలిపిన ప్రకారం పూర్తి వివరాల ప్రకారం… మహబూబూబాద్ జిల్లా చిన్న గూడురు మండలం ఉగ్గంపల్లి గ్రామానికి చెందిన దాసరి సురేష్, సరిత దాదాపు పది సంవత్సరాల కిందటే వివాహం చేసుకున్నారు. వీరికి ఒక పాప, ఒక బాబు జన్మించగా.. ఇద్దరూ పిల్లాపాపలతో అన్యోన్యంగా జీవిస్తున్నారు.

ఇదిలా ఉంటే మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని భక్త మార్కండేయ గుడి వీధికి చెందిన లాకా పద్మ, వీరస్వామి దంపతులు సురేష్ కు మేనమామ, మేనత్త వరుస అవుతారు. వారి కూతురు లాకా సంధ్య సురేష్ కు మరదలు వరుస కాగా, ఆమె మానసిక వికలాంగురాలు. కాగా మానసిక వికలాంగురాలైన సంధ్యకు చిన్నతనం నుంచే తనకు బావ వరుస అయ్యే సురేష్ అంటే ఇష్టం. కాని ఆమె మానసిక పరిస్థితి బాగోలేకపోవడంతో వారికి పెద్దలు వివాహం జరిపించలేకపోయారు. దీంతో సురేష్ సరితను వివాహం చేసుకున్నప్పటికీ సంధ్య మాత్రం అతడిని మౌనంగా ప్రేమిస్తూనే వస్తోంది.

రెండో పెళ్లి చేసిన భార్య

మానసిక వికలాంగురాలైన సంధ్య ఇదివరకే వివాహం జరిగిన తన బావ సురేష్ ను ఇష్టపడుతుండగా.. కొద్ది రోజుల కిందట తన మనసులో మాటను సురేష్ భార్య సరితతో పంచుకుంది. దీంతో తన భర్తకు విషయాన్ని చెప్పిన సరిత.. ఆయన అంగీకారంతో తన భర్తకు సంధ్యతో పెళ్లి చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సంధ్య తల్లిదండ్రులైన లాకా పద్మ, వీరస్వామి దంపతులతో మాట్లాడి, తన భర్త రెండో వివాహానికి అందరినీ ఒప్పించింది.

అనంతరం సంధ్య, సురేష్ ల వివాహాన్ని మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని భక్త మార్కండేయ గుడిలోనే జరిపించింది. ఈ తంతుకు తన బంధు మిత్రులందరినీ ఆహ్వానించింది. ఆలయ అర్చకుల మంత్రోచ్చరణలు, బంధు మిత్రుల సహకారంతో తన భర్తకు దగ్గరుండి మరీ రెండో వివాహం జరిపించింది.

వివాహానికి హాజరైన వారందరికీ భోజనాలు పెట్టించి గ్రాండ్ గా సంబరాలు కూడా నిర్వహించింది. తన భర్తకు పెళ్లిగా పెద్దగా మరీ ఆమె వివాహం జరిపించగా.. ఈ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఒక మానసిక వికలాంగురాలికి తన భర్తతో ఆదర్శ వివాహం జరిపించిన సరిత నిర్ణయాన్ని కొందరు ప్రశంసిస్తుండగా, సంధ్య సోదరి భర్త నాగరాజు మాత్రం పెళ్లి విషయమై డయల్ 100 ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

తన మరదలు మానసిక వికలాంగురాలని తెలిసి పెళ్లి చేస్తున్నారని కంప్లైంట్ చేయగా.. వివాహం జరిగిన చోటుకు చేరుకున్న పోలీసులు ఇరువురి ఇష్టపూర్వకంగా పెళ్లి జరుగుతుందని తెలుసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. కంప్లైంట్ చేసిన వ్యక్తిని మందలించి అక్కడి నుంచి పంపించేశారు.

(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ జిల్లా ప్రతినిధి)

Read Entire Article