ARTICLE AD
Maoist Couple Surrender : మావోయిస్ట్ సెంట్రల్ కమిటీ మెంబర్, తెలంగాణ రాష్ట్ర కమిటీ ఇన్ఛార్జ్ పుల్లూరి ప్రసాదరావు అలియాస్ చంద్రన్న వద్ద పని చేసిన ఇద్దరు మావోయిస్ట్ దంపతులు వరంగల్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఉద్యమ బాటను వీడి జనజీవన స్రవంతిలోకి అడుగు పెట్టారు. దీంతో వరంగల్ ఇన్ఛార్జ్ సీపీ, కరీంనగర్ సీపీ అభిషేక్ మొహంతి చేతులమీదుగా వారిలో ఒక్కొక్కరి పేరున ఉన్న రూ.4 లక్షల రివార్డు మొత్తాన్ని శుక్రవారం అందజేశారు.
అనంతరం కరీంనగర్ సీపీ, వరంగల్ ఇన్ఛార్జ్ సీపీ మావోయిస్టు దంపతుల లొంగుబాటు వివరాలను వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండలం సూదనపల్లి గ్రామానికి చెందిన తిక్క సుష్మిత ఇంటర్మీడియేట్ వరకు చదివింది. తన తండ్రి తిక్క సుధాకర్ మావోయిస్ట్ సానుభూతిపరుడిగా పని చేయగా, ఆయనను చూసి మావోయిస్టు పార్టీ వైపు ఆకర్షితురాలైంది.
2016లో మావోయిస్టు కీలక నేత బడే చొక్కారావు అలియాస్ దామోదర్ సమక్షంలో ఛత్తీస్ గడ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా కోమటిపల్లి అటవీప్రాంతంలో మావోయిస్ట్ పార్టీలో చేరింది. మొదటి నుంచి విప్లవ భావాలతో ఉన్న ఆమె చొక్కారావు అడుగుజాడల్లోనే అరణ్య బాట పట్టింది. దాదాపు ఎనిమిది సంవత్సరాలుగా మావోయిస్టు పార్టీకి సేవలందించింది.
దళంలోనే వివాహం…
ఛత్తీస్ గడ్ రాష్ట్రం సుక్మా జిల్లా పరియా గ్రామానికి చెందిన మడకం దూల అనే యువకుడు ఐదో తరగతి వరకు చదివాడు. తన అన్న మావోయిస్ట్ పార్టీలో గతంలోనే చేరగా, 2015లో దూల కూడా అడవి బాట పట్టాడు. కాగా మావోయిస్టు సెంట్రల్ కమిటీ మెంబర్ ప్రసాదరావు వద్ద సుష్మిత సెంట్రల్ కమిటీ స్టాఫ్‌గా, దూల ప్రొటెక్షన్ కమిటీ మెంబర్ గా పని చేయగా.. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు దళ సభ్యుల అంగీకారంతో 2020 మార్చి నెలలో ఇద్దరూ సుష్మిత, దూల పెళ్లి చేసుకున్నారు.
ఒక్కొక్కరిపై నాలుగు లక్షల రివార్డు..
పెళ్లి చేసుకున్న తర్వాత మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు ప్రసాద్ రావు సారథ్యంలో సుష్మిత చైతే ఏరియా కమిటీ మెంబర్ గా, మడకం దూల స్థానిక దూల కమిటీ మెంబర్ గా పని చేశారు. మావోయిస్టులు పోలీసులకు వ్యతిరేకంగా చేపట్టిన వివిధ కార్యకలాపాల్లో పాల్గొన్నారు. మావోయిస్టు నేతల సూచన మేరకు పలు దాడుల్లో భాగం పంచుకున్నారు. దీంతో పోలీసులు వారిద్దరిపై రూ.4 లక్షల చొప్పున రివార్డు కూడా ప్రకటించారు.
ఇన్ ఛార్జ్ సీపీ ఎదుట లొంగుబాటు..
దళంలోనే ఒక్కటైన సుస్మితా, దూల దంపతులు మావోయిస్టు సిద్ధాంతాలపై నమ్మకం కోల్పోయి జనజీవన స్రవంతి లో కలిసిపోయేందుకు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఇద్దరు కలిసి లొంగిపోయేందుకు సిద్ధపడ్డారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన పునరావాస పథకం గురించి తెలుసుకుని వరంగల్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. దీంతో శుక్రవారం కరీంనగర్ లో వరంగల్ ఇన్ఛార్జ్ సీపీ, కరీంనగర్ సీపీ అభిషేక్ మొహంతి వారిపై ఉన్న నగదు రివార్డును బ్యాంకు డీడీ రూపంలో వారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో కాజీపేట ఏసీపీ తిరుమల్, హసన్ పర్తి సీఐ సురేష్, తదితరులు పాల్గొన్నారు.