ARTICLE AD
Minors Driving: రోడ్డు ప్రమాదాల్లో మైనర్లు మృతి చెందుతుండటంతో కరీంనగర్ పోలీసులు స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహిస్తున్నారు. నగరంలో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ లో వందమంది మైనర్ లు బైక్ నడుపుతూ పట్టుబడ్డారు. పట్టుబడ్డ మైనర్ల నుండి వాహనాలను స్వాధీనం చేసుకుని వారి తల్లిదండ్రులకు ఏసీపీ నరేందర్ ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ నిర్వహించారు.
డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడపడం నేరమని, అందులో మైనర్లకు బైక్ ఇవ్వడం క్షమించరాదన్నారు. మైనర్లు ట్రాఫిక్ నియమాలపై సరైన అవగాహన లేకుండా డ్రైవింగ్ చేయడం కలిగే అనర్దాల గురించి పేరెంట్స్ కు వివరించారు. కరీంనగర్ లో ఇద్దరు పిల్లలు రాత్రిపూట ఫ్రెండ్ వద్దకు బైక్ పై వెళ్ళి కరెంట్ స్తంభాన్ని ఢీ కొట్టి ఇద్దరు మృతి చెందారని తెలిపారు. శంకరపట్నం వద్ద బైక్ వెళ్ళి రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మైనర్ లు ప్రాణాలు కోల్పోయారని చెప్పారు.
ప్రస్తుతం పట్టుబడ్డ వాహనాలకు జరిమానాలు విధించి విడిచిపెడుతున్నామని తెలిపారు. మరొక సారి పట్టుబడితే మైనర్లకు వాహనాలిచ్చే యజమానులపై కేసులు నమోదు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.
24 ఇసుక ట్రాక్టర్ ల పట్టివేత..
కరీంనగర్ జిల్లాలో ఇసుక అక్రమ రవాణా చేసి ట్రాక్టర్ల పై కొరడా ఝుళిపించారు పోలీసులు. 24 ఇసుక ట్రాక్టర్లను పట్టుకొని డ్రైవర్లు ట్రాక్టర్ యాజమానులు 35 మందిపై కేసు నమోదు చేశారు. మానకొండూరు పోలీస్ స్టేషన్ పరిధిలో 15, ఎల్ ఎం డి పోలీస్ స్టేషన్ పరిధిలో 9 ట్రాక్టర్ లు అక్రమంగా ఇసుక తరలిస్తుండగా పట్టుకున్నామని కరీంనగర్ రూరల్ ఎసిపి వెంకట్ రమణ తెలిపారు.
అలుగునూర్, రేణికుంటల వద్ద నిర్వహించిన వాహన తనిఖీల్లో 24 ట్రాక్టర్లు పట్టుబడ్డాయని చెప్పారు. 34 మంది పై ఐపీసీ సెక్షన్ 379, 21(4) మైన్స్ అండ్ మినరల్స్ ఆక్ట్ తో మరిన్నిసెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని ఏసిపి ప్రకటించారు. ఇసుక అక్రమ రవాణా చేస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
సిరిసిల్లలో పోలీసుల మెగా జాబ్ మేళా..
నిరుద్యోగ యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి సన్మార్గంలో నడిపించేందుకు రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం సిరిసిల్లలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. జాబ్ మేళాకు 8వేల మంది నిరుద్యోగ యువతీ యువకులు పాల్గొనగా 60 కంపెనీల్లో 1764 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించి నియామక పత్రాలు అందజేశారు.
జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిరుద్యోగ నివారణ ఫౌండేషన్ సహకారంతో నిర్వహించిన మెగా జాబ్ మేళాను ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రారంభించగా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ అఖిల్ మహాజన్, అదనపు కలెక్టర్ పూజారి గౌతమి, పాల్గొని యువతకు దిశా నిర్దేశం చేశారు.
యువత ఉపాధి అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలని ఆది శ్రీనివాస్ కోరారు. డ్రగ్ రహిత జిల్లాగా మార్చడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. యువత ఉద్యోగ అవకాశాలను అందిపుచుకోవాలని, కష్టపడి పనిచేయాలనుకునే యువత కోసం ఉద్యోగ అవకాశాలు క్యూ కడుతాయని తెలిపారు.
యువత కోసం జాబ్ మేళ నిర్వహించిన ఎస్పీ, పోలీస్ సిబ్బందికి కలెక్టర్ అభినందనలు తెలిపారు. యువత అవకాశాలను అందిబుచ్చుకోని తమకు అనుకూలంగా మార్చుకోని ఉద్యోగాల్లో రాణించాలని కోరారు. కష్టపడి పనిచేయడం అనేది ఒక అలవాటుగా మార్చుకోవడంతో పాటు, ఏ ప్రాంతంలో అయిన పనిచేసేందుకు సిద్ధపడి ఉండాలన్నారు.Ht
(రిపోర్టింగ్ కె.వి.రెడ్డి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా)