ARTICLE AD
Mlc Kavitha Remand : దిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఊరట లభించడంలేదు. ఇవాళ్టితో కవిత జ్యుడీషియల్ రిమాండ్ ముగిసింది. దీంతో ఆమెను దిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు జడ్జి కావేరి బవేజా ముందు హాజరుపరిచారు. సీబీఐ కేసులో జూన్ 3వ తేదీ వరకు కవిత రిమాండ్‌ను కోర్టు పొడిగించింది. ఈ మేరకు జడ్జి కావేరి బవేజా ఉత్తర్వులు ఇచ్చారు. దిల్లీ లిక్కర్ కేసులో మార్చి 26 నుంచి కవిత రిమాండ్ లో ఉన్న విషయం తెలిసిందే.
దిల్లీ లిక్కర్ కేసు
దిల్లీ ఎక్సైజ్ పాలసీలో అవినీతికి పాల్పడ్డారంటూ 2024 మార్చి 15న హైదరాబాద్ లో ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్టు చేసింది. అదే రోజు రాత్రి ఆమెను దిల్లీకి తరలించారు. మార్చి 16న ఎమ్మెల్సీ కవితను ట్రయల్ కోర్టు ముందు హాజరుపరిచారు. దిల్లీ లిక్కర్ కేసులో కవితను ముఖ్య పాత్ర పోషించారని ఈడీ వాదనలు వినిపించింది. కవిత ప్రోద్బలంతోనే సౌత్ గ్రూప్ నుంచి రూ. 100 కోట్లు ఆప్ నేతలకు అందాయని ఈడీ కోర్టుకు తెలిపింది. ఈ కేసులో కవితనను విచారించేందుకు మొత్తం 10 రోజులకు ఈడీ కస్టడీకి కోర్టు అనుమతించింది. ఈడీ విచారణ అనంతరం మార్చి 26న ఎమ్మెల్సీ కవితకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో కవితను తీహార్ జైలుకు తరలించారు. ఈడీ కేసులో ఉండగానే ఏప్రిల్ 11న కవితను సీబీఐ అరెస్ట్ చేసింది. మూడు రోజుల పాటు సీబీఐ విచారించి కోర్టులో హాజరుపర్చింది. సీబీఐ కేసులోనూ దిల్లీ కోర్టు కవితకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఈ కేసుల్లోనే కవితకు తాజాగా కోర్టు రిమాండ్ పొడిగించింది.
కవిత నిర్దోషి - ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
దిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇటీవల కలిశారు. తీహార్ జైలులో ఆమెను కలిసిన అనంతరం మాట్లాడిన ప్రవీణ్ కుమార్.. ఈడీ, సీబీఐపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ కేసు పూర్తిగా తప్పు అని.. ఆమె వద్ద డబ్బు ఎక్కడ దొరికిందని ప్రశ్నించారు. దర్యాప్తు సంస్థలను బీజేపీ వాడుకుంటుందని ఆరోపించారు. "కవిత చాలా స్ట్రాంగ్. బీజేపీకి మద్దతు ఇవ్వని ఇతర రాజకీయ పార్టీల నాయకులపై దర్యాప్తు సంస్థల నుంచి చాలా ఒత్తిడి ఉందని ఆమె మాతో అన్నారు. ఇది చట్టవిరుద్ధం, అనైతికం, రాజ్యాంగ విరుద్ధం. కవిత నిర్దోషి. హేమంత్ సోరెన్‌పై సెక్షన్ 7ను సీబీఐ ఎలా ప్రయోగించింది? అరవింద్ కేజ్రీవాల్‌కి కూడా అదే విధంగా శిక్ష పడిందని, అయితే కవితకు బెయిల్ ఎందుకు రాలేదు"అని ప్రవీణ్ కుమార్ నిలదీశారు.
బెయిల్ పై విచారణ
దిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణం కేసులో అరెస్టైన కవితకు ఊరట దక్కడంలేదు. కవిత బెయిల్ పిటిషన్‌పై దాఖలైన పిటిషన్లను ఇటీవల రౌస్ అవెన్యూ కోర్టు కొట్టివేసింది. దీంతో ఆమె బెయిల్ కోసం దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. బెయిల్ విచారణ ఇటీవల విచారించిన కోర్టు రెండు వారాల పాటు విచారణ వాయిదా వేసింది. కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై ఈడీ అభిప్రాయాన్ని దిల్లీ హైకోర్టు కోరింది. దీంతో తదుపరి విచారణను జస్టిస్ స్వర్ణ కాంత శర్మ ఈ నెల 24వ తేదీకి వాయిదా వేశారు.