ARTICLE AD
Pushpa2 Ticket Rates Hike : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 సినిమా టికెట్ ధరలు భారీగా పెంపునకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డిసెంబర్ 5వ తేదీ ప్రపంచ వ్యాప్తంగా పుష్ప2 ది రూల్ విడుదల కానుంది. అయితే డిసెంబర్ 4వ తేదీ రాత్రి 9.30 గంటలకు, అర్ధరాత్రి 1.00 గంటకు బెనిఫిట్ వేసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ షోల టికెట్ ధరలు భారీగా పెంచుకునేందుకు ప్రభుత్వం ఓకే చెప్పింది. బెనిఫిట్ షోల టికెట్ ధరలు సింగిల్ స్క్రీన్, మల్టీప్లెక్స్ లో రూ.800లుగా ఖరారు చేసింది.
డిసెంబర్ 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు సింగిల్ స్క్రీన్ థియేటర్ లలో టికెట్ ధర రూ.150, మల్టీప్లెక్స్ లలో రూ.200 చొప్పున విక్రయించుకునేందుకు అనుమతి ఇచ్చింది. అలాగే డిసెంబర్ 9 నుంచి 16వ తేదీ వరకు సింగిల్ స్ట్రీన్ రూ.105, మల్టీప్లెక్స్ లలో రూ.150 చొప్పున టికెట్ ధరలు పెంపునకు ప్రభుత్వం అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇంతకు మించి అదనపు రేట్లకు విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఉత్తర్వుల్లో పేర్కొంది.
అర్ధరాత్రి 1 గంట నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు అదనపు షోలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. డిసెంబర్ 17 నుంచి 23 వరకు సింగిల్ స్క్రీన్‌లో రూ.20, మల్టీఫ్లెక్స్‌లో రూ.50 పెంపునకు సైతం అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
12 వేలకు పైగా థియేటర్లలో
పుష్ప2 సినిమాను ప్రపంచ వ్యాప్తంగా ఆరు భాషల్లో 12 వేలకిపైగా థియేటర్లలో విడుదల అవుతుంది. దీంతో పాటు అత్యధిక థియేటర్లలో ఐమాక్స్ ఫార్మాట్‌లో విడుదలకానున్న ఇండియన్ మూవీగా పుష్ప2 రికార్డులు సృష్టించనుంది. దీంతో పాటు సినీడబ్స్ యాప్ తో ఏ భాషలోనైనా ఈ సినిమాను ఆస్వాదించేందుకు ఏర్పాట్లు చేసినట్లు నిర్మాతలు ప్రకటించారు. ఇప్పటికే పుష్ప2 బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ఈ సినిమా రన్ టైమ్ 3 గంటల 20 నిమిషాల 38 సెకన్ల అని తెలుస్తోంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ ఇచ్చింది.
అల్లు అర్జున్ వీడియోపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం తన వంతు బాధ్యతగా హీరో అల్లు అర్జున్ ఓ ప్రత్యేక వీడియో విడుదల చేశారు. "మీకు తెలిసిన వారు ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటే తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో టోల్ ఫ్రీ నెంబరు 1908కు ఫోన్ చేయండి, వాళ్లు వెంటనే బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించి, సాధారణ జీవనశైలిలోకి వచ్చేవరకూ జాగ్రత్తగా చూసుకుంటారు. ఇక్కడ ప్రభుత్వ ఉద్దేశం వారిని శిక్ష విధించడం కాదు సాయం చేయడం. మంచి సమాజం కోసం డ్రగ్స్ బాధితులకు అండగా నిలుద్దాం’’ అని అల్లు అర్జున్ వీడియో పోస్టు చేశారు.
ఈ వీడియోపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్ లో పోస్టు పెట్టారు. డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన కల్పించేందుకు హీరో అల్లు అర్జున్ వీడియో చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఆరోగ్యకరమైన రాష్ట్రం, సమాజం కోసం అందరం చేతులు కలుపుదామని విజ్ఞప్తి చేశారు. #SayNoToDrugs వంటి హ్యాష్ ట్యాగ్స్‌ను జోడిస్తూ సీఎం ట్వీట్ చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ కు హీరో అల్లు అర్జున్ రిప్లై ఇచ్చారు. హైదరాబాద్ నగరాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహితంగా తీర్చిదిద్దేందుకు సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న చొరవకు అభినందనలు తెలిపారు. హీరోయిన్ రష్మిక మంధాన సైతం షీటీమ్‌కు సపోర్ట్‌గా ఓ వీడియో విడుదల చేశారు. బయటకు వెళ్లే అమ్మాయి భయపడొద్దని, ఒకవేళ అన్యాయం జరిగితే షీ టీమ్‌ని ఆశ్రయించాలని విజ్ఞప్తి చేస్తూ వీడియో పెట్టారు.