ARTICLE AD
Rajanna Sircilla News : రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మూడేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి మృతి చెందాడు. బాలుడు మృతిని తట్టుకోలేక తల్లి గుండెలవిసేలా విలపించింది. గుండెపోటుకు గురై ఆసుపత్రిలో చేరింది. ఈ విషాదకర ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో చోటుచేసుకుంది.
ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ అనుబంధం గ్రామం అయిన గాజులపల్లికి చెందిన పెద్దోళ్ల కిషన్ యాదవ్-అనూష దంపతుల కుమారుడు శ్వేహన్ (3) ఇంటి ముందు నీటి పంపు వద్ద ఆడుకుంటుండగా తన చేతిలో ఉన్న పలక ఓపెన్ సంపులో పడిపోయింది. పలకను తీసేందుకు శ్వేహన్ ప్రయత్నం చేస్తుండగా నీటిసంపులో పడిపోయాడు. కాసేపటికి తల్లి అనూష కొడుకు కనిపించడం లేదని వెతకగా నీటి సంపులో శ్వేహన్ లో పైకి తేలాడు. తండ్రితో పాటు స్థానికులు శ్వేహన్ ను వెలికి తీసి సిరిసిల్లలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే బాలుడు మృతి చెందినట్లు డాక్టర్ చెప్పారు.
గుండెలవిసేలా తల్లి రోదన
అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకు విగతజీవిగా కనిపించిన కొడుకును చూసి తల్లి అనూష గుండెలవిసేలా విలపించింది. ఇక కొడుకు లేడనే నిజాన్ని ఆ తల్లి తట్టుకోలేక బోరున విలపించడంతో అస్వస్థతకు గురయ్యారు. వెంటనే కుటుంబ సభ్యులు సిరిసిల్ల ఆసుపత్రికి తరలించగా గుండె పోటుకు గురైనట్లు గుర్తించి వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం తల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కొడుకును కడసారి చూపుకు సైతం ఆ తల్లి నోచుకోకపోవడం చూపరుల సైతం కన్నీళ్లు పెట్టుకున్నారు. కొడుకు మృతి, భార్య ఆసుపత్రి పాలుకావడంతో భర్త కిషన్ కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం అలుముకుంది.
భార్యను చంపి భర్త ఆత్మహత్య
రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం జరిగింది. భార్యను చంపి భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. క్షణికావేశంలో దంపతులిద్దరు ప్రాణాలు కోల్పోవడంతో వారి ముగ్గురు పిల్లలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సిరిసిల్ల పట్టణంలోని శాంతినగర్ లో నివాసం ఉండే దూస రాజేశం (54) భార్య లక్ష్మి (50) ని బెడ్ రూం లో బలమైన ఆయుధంతో మొహం పై కొట్టి హత్య చేశాడు. భార్యను చంపి అనంతరం భర్త రాజేశం ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కలహాలే దారుణ ఘటనకు కారణమని స్థానికులు తెలిపారు.
రెండు కిడ్నీలు చెడిపోవడంతో డయాలసిస్ చేయించుకుంటున్నారు రాజేశం. భార్య భర్తల మధ్య మాటమాట పెరిగి క్షణికావేశంతో భార్యపై దాడి చేసి హత్య చేసినట్లు తెలుస్తోంది. భార్య రక్తం మడుగులో పడి ప్రాణాలు కోల్పోవడంతో ఆవేశంతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. లక్ష్మీ రాజేశం దంపతులకు ఇద్దరు కొడుకులు, ఒక బిడ్డ ఉన్నారు. పెద్ద కొడుకు వేణు, బిడ్డ మౌనిక కు వివాహం కాగా చిన్న కొడుకు వెంకటేష్ బిటెక్ చదువుకున్నాడు. తల్లిదండ్రులు ఇద్దరు క్షణికావేశంతో ప్రాణాలు కోల్పోవడంతో కన్నీరుగా పిలిపించారు. అమ్మను చంపి నాన్న ఉరివేసుకొని చనిపోయాడని ఇద్దురు కొడుకులు బిడ్డ బోరున విలపించారు.
రిపోర్టింగ్: కె.వి.రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు.