ARTICLE AD
Rajanna Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వేర్వేరు ఘటనల్లో ఓ చేనేత కార్మికుడు, ఓ రైతు నేడు (జూన్ 22) ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఒకే రోజు ఇద్దరి ఆత్మహత్య జిల్లాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆర్థిక ఇబ్బందులతో ఆ ఇద్దరూ బలవన్మరణానికి పాల్పడ్డారు.
యాసిడ్ తాగిన నేతన్న
సిరిసిల్లలోని రాజీవ్ నగర్‌లో నేత కార్మికుడు కుడిక్యాల నాగరాజు (47) బాత్రూమ్ శుభ్రం చేసే యాసిడ్ తాగి ఆత్మహత్య చేసుకున్నారు. అప్పులు, ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మరమగ్గాలు నడుపుతూ జీవనం సాగించే నాగరాజుకు ఆరు నెలల నుంచి పని లేక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడని స్థానికులు తెలిపారు. రూ.4 లక్షల అప్పు కాగా, ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న అబ్బాయికి కాలేజీ ఫీజు ఎలా కట్టాలని తీవ్ర ఆందోళనకు గురై యాసిడ్ తాగాడని తెలుస్తోంది. ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ నాగరాజు మృతి చెందారని కుటుంబ సభ్యులు తెలిపారు.
మృతుడికి భార్య లావణ్య, కొడుకులు లోకేశ్, విఘ్నేశ్ ఉన్నారు. నాగరాజు ఆత్మహత్యతో పెద్ద దిక్కును కోల్పోయామంటూ కుటుంబ సభ్యులు బోరున విలపించారు. తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకున్నారు.
రైతు ఆత్మహత్య
వేములవాడ రూరల్ మండలం హన్మాజీపేట గ్రామానికి చెందిన రైతు ఎల్లాల తిరుపతిరెడ్డి (52) పురుగుల మందు తాగి ఆత్మహత్య పాల్పడ్డారు. ఆర్థిక ఇబ్బందులతో మానసిక స్థితి సరిగా లేక పొలం వద్ద పురుగుల మందు తాగి బలవణ్మరణం చేసుకున్నారని స్థానికులు తెలిపారు. మృతునికి భార్య లక్ష్మి, ఒక కూతురు ఉన్నారు. ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని స్థానిక రాజకీయ నాయకులు కోరారు.