ARTICLE AD
Road Accident in Medak : మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చేగుంట దగ్గర ఉన్న 44వ జాతీయ రహదారిపై జరిగిన ఈ ఘటనలో నలుగురు దుర్మరణం చెందారు.
ముందు వెళ్తున్న లారీని వెనక నుంచి వస్తున్న మరో లారీ బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో వెనక లారీలో క్యాబిన్‌లో కూర్చున్న నలుగురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పల్నాడులో ఘోర ప్రమాదం…
ఇన్నోవా కారు చెట్టుకు ఢీకొని ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ ఘటన గురువారం పల్నాడు జిల్లా వినుకొండ మండలం కొత్తపాలెం వద్ద జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన భార్య భర్తలు మరణించగా, ఆయన కుమారుడు, కుమారుడి భార్య, పిల్లలకు తీవ్ర గాయాలు అయ్యాయి. వీరిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు.
గుంటూరు జిల్లా లక్ష్మీపురానికి చెందిన తిరుమల తిరుపతి దేవస్థానం రిటైర్డ్ ఉద్యోగి సోమేసి బాలగంగాధర్ శర్మ కుటుంబ సభ్యులు కర్ణాటకలోని బళ్లారిలో శుభకార్యానికి వెళ్లారు. ఆ శుభకార్యాన్ని ముగించుకొని ఇన్నోవా కారులతో తిరిగి గుంటూరు వస్తున్నారు. మరికొద్ది సేపట్లో గమ్యస్థానానికి చేరుకుంటారనే లోపే ఈ విషాదం చోటు చేసుకుంది.
వినుకొండలోని కొత్తపాలెం వద్దకు వచ్చేసరికి కారు డ్రైవర్ నిద్రమత్తులో ఉండటంతో కారు అదుపు తప్పి జాతీయ రహదారి పక్కన ఉన్న చెట్టుకు ఢీకొట్టింది. కారు ఒక్కసారిగా అతివేగంగా చెట్టును ఢీకొట్టేసరికి, కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయింది. దీంతో సోమేసి బాలగంగాధర్ శర్మ (78), ఆయన భార్య యశోద (69), కారు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందారు. సోమేసి బాలగంగాధర్ శర్మ కుమారుడు హెచ్ఎస్‌వై నాగశర్మ, కోడలు నాగసంధ్య, వారి పిల్లలు అనుపమ, కార్తిక్‌లు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
కర్ణాటకలో ఘోర ప్రమాదం…..
కర్ణాటకలో విషాదకర చోటు చేసుకుంది. కర్ణాటకలోని పూణె-బెంగళూరు హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హావేరీ జిల్లాలోని గుండెనహల్లి క్రాసింగ్ వద్ద.. ఆగి ఉన్న ఓ ట్రక్‌ని ఓ మినీ బస్సు బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో 13మంది ప్రాణాలు కోల్పోయారు.
శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల సమయలో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. ప్రమాదం సమయంలో మినీ బస్సులో 17మంది ఉన్నారు. కాగా.. ప్రమాదంలో 11 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారని తెలుస్తోంది.
కర్ణాటక రోడ్డు ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే స్పందించిన పోలీసులు.. ఘటనాస్థలానికి పరుగులు తీశారు. సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను, క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో.. చికిత్స పొందుతూ, మరో ఇద్దరు ఆసుపత్రిలో ప్రాణాలు కోల్పోయారు. చికిత్స పొందుతున్న వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.