Siddipet Tragedy : ప్రాణం తీసిన కరెంట్.. ఆ యువతికి పుట్టిన రోజే చివరి రోజైంది

1 month ago 64
ARTICLE AD

సిద్ధిపేట జిల్లా చేర్యాల మండల పరిధిలోని నాగపురి గ్రామానికి చెందిన మజ్జిగ నర్సింహులు, లావణ్య దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వీరిది వ్యవసాయ కుటుంబం. వీరి పెద్ద కుమార్తె కావ్య (16) ఇంటర్ పూర్తి చేసి ప్రస్తుతం ఇంటి వద్ద ఉంటుంది. పేద కుటుంబం కావడంతో బీడీలు చేస్తూ తల్లితండ్రులకు చేదోడువాదోడుగా ఉంటుంది.

ఈ క్రమంలో కావ్య గురువారం ఇంటి ఆవరణలో ఉన్న సంపూ నుండి నీటిని తీయడానికి మోటర్ స్విచ్ ఆన్ చేస్తుండగా.. ప్రమాదవశాత్తు కరెంట్ షాక్‌కు గురైంది. గట్టిగా అరుస్తూ అపస్మారక స్థితికి చేరి కింద పడిపోయింది. గమనించిన కావ్య చెల్లెలు అక్కను కాపాడేందుకు ప్రయత్నించగా.. ఆమెకు స్వల్పంగా షాక్ తగిలింది.

వెంటనే కుటుంబ సభ్యులు వారిని చేర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు కావ్య అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. సంతోషంగా పుట్టినరోజు జరుపుకోవాల్సిన కూతురు విద్యుత్ షాక్‌తో మృతి చెందడంతో కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. ఈ ఘటనతో నాగపురి గ్రామంలో విషాధచాయలు అలుముకున్నాయి. మృతురాలి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

సంగారెడ్డిలో..

ఆర్ధిక ఇబ్బందులతో కుటుంబ పోషణ భారమై.. మనస్ధాపం చెందిన ఓ కూలీ ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పటాన్‌చెరు మండలం ఐనోల్ గ్రామానికి చెందిన నగేష్ (33) కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతనికి భార్య లలిత, ముగ్గురు పిల్లలు ఉన్నారు. భార్య కూడా అప్పుడప్పుడు కూలీ పనులకు వెళ్తుంది. పనికి వెళ్తే కానీ కుటుంబాన్ని పోషించలేని పరిస్థితి.

వీరి కష్టాలకు తోడు రూ. 4 లక్షల వరకు అప్పులు అయ్యాయి. ఎలాగోలా కుటుంబాన్ని పోషిస్తున్న క్రమంలో నాలుగు రోజుల కిందట నగేష్ బైక్ మీద నుండి కింద పడడంతో గాయాలయ్యాయి. పనికి వెళ్లలేక ఆర్ధిక ఇబ్బందులతో మనస్థాపం చెందిన నగేష్.. గురువారం ఇంట్లో ఎవరు లేని సమయంలో దూలానికి ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. బయటకు వెళ్లిన భార్య వచ్చి చూసేసరికి వేలాడుతూ కన్పించాడు. ముగ్గురు పిల్లల భారం తనపై వదిలి భర్త చనిపోవడంతో ఆమె కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. మృతుడి భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఎస్పీ సూచనలు..

తెలంగాణాలో చలి తీవ్రత అధికంగా ఉండడంతో పొగమంచు ఎక్కువగా ఉంటుంది. రహదారులపై వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. పొగ మంచులో ప్రయాణం ప్రమాదకరమని, శీతాకాలంలో పరిమితవేగం సురక్షితమని సంగారెడ్డి ఎస్పీ రూపేష్ సూచించారు. శీతాకాలంలో ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి చేరి, పొగమంచు దట్టంగా కమ్మేస్తుంది. రహదారులపై ఎదురుగా వచ్చే వాహనాలు సరిగ్గా కనిపించని పరిస్థితులు ఏర్పడుతాయి. ఈ సమయంలోనే ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నారు.

జాగ్రత్తలు..

1.తక్కువ బీమ్‌పై హెడ్ లైట్లను సెట్ చేసుకోవడం మంచిది. హై- బీమ్ హెడ్ లైట్లను ఉపయోగించడం వలన పొగమంచు కాంతికి రిఫ్లెక్ట్ అవుతూ.. ప్రమాదాలకు దారి తీయవచ్చు.

2.పొగమంచు వాతావరణంలో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు చెవులు చురుకుగా పని చేయాలి. దట్టమైన పొగమంచు సమయంలో కళ్ళతో చూడలేని వాటిని చెవులతో పసిగట్టాలి. వాహనాల టైర్ల, హారన్ల శబ్దాలను విని దూరాన్ని అంచనా వేయగలగాలి.

3.పొగమంచులో రహదారిపై వెళ్తున్నప్పుడు వాహనాలు సరిగ్గా కనిపించవు. ఇతర డ్రైవర్లకు మనం ఎటువైపు వెళ్లాలనుకుంటున్నామో ఇండికేటర్ ద్వారా సూచించడం చాలా ముఖ్యం.

4.పొగమంచు ఉన్న సమయంలో డ్రైవింగ్‌లో సహనం కీలకం. వాహనాన్ని ఓవర్ టెక్ చేయడానికి ప్రయత్నించినప్పుడు ఎదుటి డ్రైవర్ ఏకాగ్రత దెబ్బతిని రోడ్డు ప్రమాదానికి కారణం కావచ్చు.

(రిపోర్టింగ్- ఉమ్మడి మెదక్ జిల్లా ప్రతినిధి, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)

Whats_app_banner

Read Entire Article