Siricilla Crime: జల్సాల కోసం ఆలయాల్లో చోరీలు, ఎల్లారెడ్డిపేట పోలీసులకు చిక్కిన గజదొంగ

8 months ago 156
ARTICLE AD

Siricilla Crime: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలు ఆలయాల్లో వరుస చోరీలకు పాల్పడ్డ గజదొంగ పోలీసులకు చిక్కాడు. ఆలయాల్లో చోరీలకు పాల్పడుతూ అటు భక్తులకు ఇటు పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేసిన చోరుడిని ఎట్టకేలకు ఎల్లారెడ్డిపేట పోలీసులు పట్టుకున్నారు.‌ వెయ్యి రూపాయల నగదుతో పాటు దొంగతనానికి ఉపయోగించే రాడ్ ను స్వాధీనం చేసుకున్నారు.

సిరిసిల్ల డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి సమక్షంలో అరెస్టు అయిన బద్ధుల యుగేందర్ ను చూపించి వివరాలు వెల్లడించారు. కరీంనగర్ సమీపంలోని దుర్షెడ్ గ్రామానికి చెందిన యుగేందర్ కూలీ పనితో పాటు వ్యాన్ క్లీనర్ గా పని చేస్తాడు.

మద్యానికి, జల్సాలకు అలవాటు పడ్డ యుగేందర్ జల్సాలకు డబ్బుల కోసం దొంగతనాలకు అలవాటు పడ్డాడు. ఈనెల 26న ఒకే రోజు ఎల్లారెడ్డిపేట మండలం గోరంటాల గ్రామ శివారులో గల సాయి బాబా గుడిలో, అదే రోజు రాత్రి బొప్పాపూర్ శివారులో గల ఎల్లమ్మ ఆలయంలో, పెద్దమ్మ గుడిలో చోరీలకు పాల్పడ్డాడు. ఆలయాల చోరీలపై ఎల్లారెడ్డిపేట సిఐ, ఎస్ఐ స్పెషల్ టీం ఏర్పాటు చేసి నిఘా పెట్టగా యుగేందర్ పట్టుబడ్డాడని డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.

జైలుకు వెళ్ళొచ్చినా మారని తీరు...

ఆలయాల్లో చోరీలకు పాల్పడి అరెస్టు అయిన యుగంధర్ గతంలో కరీంనగర్ లో పలు చోరీలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. 2010 నుంచి 2018 నగరంలో పలు చోరీలకు పాల్పడగా 2018 లో అరెస్టు చేసి జైల్ కు పంపించినట్లు చెప్పారు. జైల్ నుంచి విడుదలైనా తీరు మార్చుకోక మళ్ళీ చోరీలకు పాల్పడుతూ పట్టుబడ్డాడని తెలిపారు.

యుగేందర్ గతంలో కరీంనగర్ జిల్లాలో 17 పైగా కేసులు ఉన్నాయని డిఎస్పీ తెలిపారు. ఆలయాల్లో చోరీలకు పాల్పడే గజదొంగను పట్టుకోవడంలో కీలకపాత్ర పోషించిన సి.ఐ శ్రీనివాస్, ఎస్.ఐ రమాకాంత్, క్లూస్ టీం ఏ. ఎస్.ఐ శరత్ ను అభినందించారు.

గంజాయి విక్రయించే ఇద్దరు అరెస్ట్...

ఇల్లంతకుంట మండలం వంతడుపుల లో గంజాయి విక్రయించేందుకు యత్నించిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు వారి నుంచి 150 గ్రాములు గంజాయి, రెండు సెల్ ఫోన్ లు స్వాధీనం చేసుకున్నారు.

ఇల్లంతకుంట మండలం పొత్తూరు కు చెందిన గుంటి శివ కుమార్, గన్నేరువరం మండల కేంద్రానికి చెందిన బుర్ర ప్రణయ్ గంజాయి సిగరెట్లు తాగడానికి అలవాటుపడి, అక్రమంగా గంజాయి విక్రయించే దందాకు తెరలేపారని పోలీసులు తెలిపారు.

ఎక్కువ ధరకు గంజాయి సిగరేట్లు విక్రయించి సొమ్ము చేసుకోవాలని చూసి పోలీసులకు చిక్కారని తెలిపారు. గంజాయి నిర్మూలనకు ప్రతి రోజు డ్రంక్ అండ్ డ్రైవ్ తరహాలో గంజాయి టెస్ట్ నిర్వహించి పట్టుకుని చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

(రిపోర్టింగ్ కె.వి.రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందూస్థాన్ టైమ్స్ తెలుగు)

WhatsApp channel

Read Entire Article