ARTICLE AD
Street Dog Attack : మంచంపై నిద్రిస్తున్న 42 రోజుల పసికందును వీధి కుక్కలు కరిచి చంపేశాయి. ముక్కుపచ్చలారని ఆ పసిగుడ్డుపై దారుణంగా దాడి చేయగా, ఆ మగ శిశువు ప్రాణాలు కాస్త గాలిలో కలిశాయి. దీంతో ఆ ఇంట్లో కొడుకు పుట్టిన సంతోషం అంతలోనే ఆవిరైపోయింది. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం మడిపల్లిలో ఈ ఘటన సోమవారం చోటు చేసుకోగా, ఆలస్యంగా మంగళవారం వెలుగులోకి వచ్చింది. మడిపల్లికి చెందిన రేణుకకు నెల్లికుదురు మండలం చెట్ల ముప్పారం గ్రామానికి చెందిన దర్శనం వెంకన్నతో కొంతకాలం కిందట వివాహం జరిగింది. కాగా గతేడాది గర్భం దాల్చిన రేణుక ప్రసవం కోసం తల్లిగారి ఇంటికి మడిపల్లికి వచ్చింది. ఈ క్రమంలోనే దాదాపు 42 రోజుల కిందట రేణుక ప్రసవించగా, మగ శిశువు జన్మించాడు. దీంతో ఆ కుటుంబంలో సంతోషం వెల్లివిరిసింది.
ఇంట్లోకి చొరబడి కరిచిన కుక్క
సోమవారం ఉదయం దాదాపు 8 గంటల సుమారులో రేణుక తన కొడుకును ఇంట్లో పడుకోబెట్టి తల్లి వెంకటమ్మతో కలిసి బయట పనులు చేస్తోంది. ఈ సమయంలోనే ఓ వీధి కుక్క ఇంట్లోకి చొరబడి మంచంపై నిద్రిస్తున్న శిశువును తలను నోట కరుచుకుంది. దీంతో ఆ పసికందు గావు కేక పెట్టగా, ఏడుపు శబ్దం విన్న రేణుక, ఆమె తల్లి ఇద్దరూ పరుగున ఇంట్లోకి ఉరికొచ్చారు. ఇంట్లోకి వెళ్లి చూడగా, పసికందు కాస్త తీవ్ర గాయాలతో రక్త స్రావమవుతూ కనిపించాడు. దీంతోనే వెంటనే పసికందును తొర్రూరులోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని అక్కడి సిబ్బంది చెప్పడంతో వెంటనే 108 అంబులెన్స్‌లో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఎమర్జెన్సీ వార్డులో చికిత్స అందిస్తున్న క్రమంలోనే శిశువు కన్నుమూశాడు. నవ మాసాలు మోసి కన్న బిడ్డను వీధి కుక్క బలితీసుకోవడంతో తల్లి రేణుక, ఇతర కుటుంబ సభ్యులు విలపించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. కాగా కళ్లు తెరవని బాలుడి మృతితో మడిపల్లిలో తీవ్ర విషాదం నెలకొంది.
ప్రాణాలు తీస్తున్న కుక్కలు
ఉమ్మడి వరంగల్ జిల్లాలో వీధి కుక్కలు చిన్నారుల ప్రాణాలు తీస్తున్నాయి. గతేడాది మే 19న బతుకు దెరువు నిమిత్తం ఉత్తరప్రదేశ్ నుంచి కాజీపేటకు వచ్చిన ఓ వలస కుటుంబంలోని ఏడేళ్ల బాలుడిని వీధి కుక్కలు దారుణంగా చంపేశాయి. బహిర్భూమికి వెళ్లిన బాలుడిని వీధి కుక్కలు చుట్టు ముట్టి హతమార్చాయి. దీంతో ఈ ఘటన అప్పట్లో తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన జరిగిన కొద్ది రోజులకు జూన్ 17న హనుమకొండ జిల్లా కాజీపేట మండలం బట్టుపల్లి సమీపంలోని రాజీవ్ గృహ కల్ప కాలనీలో ఇంట్లోకి చొరబడి ఆడుకుంటున్న పిల్లలపై దాడి చేశాయి. కుక్కల దాడిలో ఇద్దరు చిన్నారులు గాయపడగా, వారిలో 18 నెలల బాలుడు డేవిడ్ రాజును ఓ కుక్క నోట కరుచుకొని బయటకి ఈడ్చుకొచ్చింది. దీంతో ఆ బాలుడు ఆర్త నాదాలు చేయగా, గమనించిన స్థానికులు వీధి కుక్కలను చంపేశారు. అనంతరం పిల్లలిద్దరినీ వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో చేర్పించారు. డేవిడ్ రాజుకు తీవ్ర గాయాలు కాగా ఎంజీఎంలో చికిత్స పొందుతూ గతేడాది జులై 12న ప్రాణాలు కోల్పోయాడు.
పది రోజుల కిందట
ఈ ఏడాది జూన్ 8న జనగామ జిల్లాలో ఆరేళ్ల బాలుడిని వీధి కుక్కలు కరిచి చంపేశాయి. జనగామ జిల్లా చిలుపూర్ మండలం లునావత్ తండాకు చెందిన గుగులోత్ మధు, సరిత దంపతులకు ఇద్దరు కొడుకులు కాగా చిన్న వాడైన అభిరామ్ (6) తల్లిదండ్రుల వెంట పొలం పనులకు వెళ్లాడు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో బాలుడిని అతని తండ్రి ఇంటికి వెళ్లాల్సిందిగా చెప్పి, తండా సమీపంలో ఒంటరిగా వదిలేసి తిరిగి పొలానికి వెళ్లిపోయాడు. సాయంత్రం ఇంటికి వచ్చిన మధు, సరిత దంపతులకు బాలుడు కనిపించలేదు. దీంతో కంగారు పడిపోయిన దంపతులిద్దరూ చుట్టుపక్కల వెతకగా తండాకు సమీపంలోని ఓ వాగులో బాలుడు శవమై కనిపించాడు. ఒంటిపై కుక్కలు కరిచిన గాట్లు ఉండడం.. సమీపంలో కుక్కలు మంద కనిపించడంతో వాటి పనేనని గుర్తించారు. అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకు కుక్కల బారిన పడి ప్రాణాలు కోల్పోవడంతో కన్నీరుమున్నీరయ్యారు. ఇలా తరచూ కుక్కలు దాడి చేసి చిన్నారుల ప్రాణాలు తీస్తున్న అధికారులు, పాలకులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇకనైనా వీధి కుక్కల నియంత్రణకు తగిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.
(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)