ARTICLE AD
Street Dogs Attack : రాష్ట్రంలో వీధి కుక్కల దాడులు ఆగడం లేదు. నగరాలతో పాటు పల్లెలో కూడా వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. మొన్న మహబూబాబాద్ జిల్లా, తొర్రూరు మండలం మడిపల్లీ గ్రామంలో 42 రోజుల పసికందు కుక్కలు దాడిలో మృత్యువాత పడిన ఘటన మరవకముందే.... తాజాగా వీధి కుక్కల దాడిలో పాఠశాలకు వెళ్లిన ఎనిమిదేళ్ల బాలుడు మరణించాడు. ఈ విషాద ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం ఇస్నాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే ఇస్నాపూర్ గ్రామానికి చెందిన విశాల్ (8) మల విసర్జనకు గ్రామంలో మహీధర వెంచర్ కి వెళ్లగా... అక్కడ విశాల్ పై ఒకేసారి నాలుగైదు వీధి కుక్కలు దాడి చేశాయి. దీంతో బాలుడ్ని గమనించిన స్థానికులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అలాగే ఇదే మండల పరిధిలోని ముత్తాంగిలో కూడా 7 నెలల చిన్నారిని కూడా కుక్కలు తీవ్రంగా కరవడంతో చిన్నారిని పటాన్ చెరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
చాయ్ పెట్టలేదని చున్నీతో కోడలిని హత్య చేసిన అత్తా
చాయ్ పెట్టమంటే పెట్టలేదని కోడలిని హత్య చేసింది ఓ అత్త. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని అత్తాపూర్ డివిజన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే అత్తాపూర్ లోని హాసన్ నగర్ ప్రాంతానికి చెందిన ఫర్జానా అనే వృద్ధురాలు......తన కొడుకు, కోడలితో కలిసి గత కొన్నేళ్లుగా నివసిస్తుంది. కాగా ఆమెకు తన కోడలు అజ్మీర్ బేగం (28) మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. ఈ క్రమంలోనే గురువారం ఉదయం ఫర్జానా తన కోడలు అజ్మీర్ బేగంను చాయ్ పెట్టమని కోరింది. అయితే చాయ్ పెట్టేందుకు కోడలు నిరాకరించింది. దీంతో అత్తాకోడళ్ల మధ్య మాటా మాటా పెరిగి వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే కోపోద్రిక్తురాలైన అత్తా ఫర్జానా పక్కనే ఉన్న చున్నీతో కోడలు మెడకు చుట్టి గట్టిగా బిగించింది. అనంతరం కింద పడేసి కూడా చున్ని వదలకుండా అలాగే బిగించింది. దీంతో కోడలు అజ్మీర్ బేగం మృతి చెందింది. ఆ తరువాత ఫర్జానా అత్తాపూర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయింది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
బీఆర్ఎస్ యువనేత హఠాన్మరణం
చాంద్రాయణగుట్ట నియోజకవర్గ బీఆర్ఎస్ యువనేత, సోషల్ మీడియా ఇన్ ఛార్జ్ రాసం దిలీప్ కుమార్ మరణించారు. జంగమ్మెట్ ప్రాంతానికి చెందిన దిలీప్ కుమార్ బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పాల్గొన్నారు. ఉదయం ఛాతీ నొప్పి వస్తుందని కుటుంబ సభ్యులకు తెలపగా వారు హుటాహుటిన ఒవైసీ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి తరలించిన కాసేపటికే అతడు మృతి చెందాడు. కాగా దిలీప్ కుమార్ గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న మాజీ కార్పొరేషన్ చైర్మన్, బీఆర్ఎస్ నేతలు ఆయనకు నివాళులు అర్పించారు.
కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా