Telangana Congress : సీఎం మార్పునకు అవకాశముందా..? కోమటిరెడ్డి వ్యాఖ్యల వెనుక ఉద్దేశమేంటి..?

2 months ago 71
ARTICLE AD

పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులను మార్చడం కాంగ్రెస్ పార్టీకి కొత్తేం కాదు. సీఎంలను మార్చివేయడంలో ఆ పార్టీకి ఘనమైన రికార్డు ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 1978 నుంచి 1983 వరకు అంటే అయిదేళ్ల పాలనా కాలంలో ఏకంగా నలుగురు ముఖ్యమంత్రులను మార్చింది.

తొలుత మర్రి చెన్నారెడ్డి ఆ తర్వాత టంగుటూరి అంజయ్య, భవనం వెంకట్రామ్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి అయిదేళ్ల పాలనా కాలన్ని పంచుకున్నారు. ఆ తర్వాత 1989లో తెలుగుదేశం నుంచి అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత మొదట మర్రి చెన్నారెడ్డి.. ఆయనను మార్చి నేదుమల్లి జనార్ధన్ రెడ్డి, ఆయన స్థానంలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఐదేళ్ల పదవీ కాలానికి సీఎంలుగా పనిచేశారు.

ఈ రెండు 1957 నుంచి 2009 వరకు కాంగ్రెస్ అధికారంలో ఉన్న ప్రతీ సందర్భంలో సీఎంల మార్పు అలవోగా జరిగింది. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకంటే.. తెలంగాణ కాంగ్రెస్ లో ఒక హాట్ టాపిక్ మొదలైంది. సీఎం రేవంత్ రెడ్డిని మారుస్తున్నారా..? ఆ స్తానంలో కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి అవకాశం దక్కుతుందా..? అన్న చర్చ మొదలు కావడానికి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి యథాలాపంగా చేసిన వ్యాఖ్యలు కారణం అవుతున్నాయి.

కోమటిరెడ్డి వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకమా..?

భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ స్థాయి సాగునీటి శాఖ సమీక్ష సమావేశం శుక్రవారం భువనగిరిలో జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర సాగునీటి శాఖా మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రి అని సంభోదించి, ఆ వెంటనే సర్దుకుని మంత్రి అంటూ ప్రసంగం మొదలు పెట్టారు. ఉత్తమ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రి అని సంబోధించడాన్ని సమర్ధించుకున్నారు. సీఎం కావాల్సి ఉన్నా ఉత్తమ్ కు ఆపదవి తప్పిపోయిందని… భవిష్యత్ లో తప్పని సరిగా సీఎం అవుతారని వ్యాఖ్యానించారు. తన నాలుకపై పుట్టుమచ్చ ఉందని, తాను అన్న మాటలు నిజం అవుతాయని సూత్రీకరించారు. అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం అవుతారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి యథాలాపంగా అన్నారా..? లేక, ఉద్దేశ పూర్వకంగానే వ్యాఖ్యానించారా..? అన్న చర్చ మొదలైంది. కోమటిరెడ్డికి ఏదన్నా ముందస్తు సమాచారం ఉందా..? నిజంగానే ఇపుడు తెలంగాణలో మరికొన్ని రోజులకైనా సీఎంను మార్చే పరిస్థితులు ఉన్నాయా..? అన్న అంశాలు చర్చకు వస్తున్నాయి. సోషల్ మీడియాలో సైతం ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఉన్న అర్హతలపై పోస్టింగులు మొదలయ్యాయి.

ఫ్రస్టేషన్ లో అలా అన్నారా..?

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ముందు నుంచీ సీఎం రేవంత్ రెడ్డితో అంతగా సఖ్యత లేదు. 2018 లో ఎమ్మెల్యేగా గెలిచాక రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ శాసన సభా పక్ష నేత ( సీఎల్పీ నేత ) పదవిని ఆశించారు. కానీ, ఆ పదవికి మల్లు భట్టి విక్రమార్కను ఎంపిక చేశారు. ఆ తర్వాత టీపీసీసీ చీఫ్ పదవి కోసం ప్రయత్నించారు. కానీ, అప్పటికే టీటీడీపీ నుంచి వచ్చి ఉన్న రేవంత్ రెడ్డికి తెలంగాణ కాంగ్రెస్ సారథ్య బాధ్యతలు దక్కాయి.

ఈ రెండు పదవులూ దక్కకుండా పోవడంతో రాజగోపాల్ రెడ్డిలో అసహనం పెరిగి చివరకు పార్టీకి దూరం అయ్యారు. కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఆయన కాషాయ కండువా కప్పుకుని బీజేపీ నుంచి ఉప ఎన్నికల్లో పోటీచేసి ఓటమి పాలయ్యారు. ఉప ఎన్నికల సమయంలో టీపీసీసీ అధ్యక్షునిగా ఉన్న రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్య మాటల యుద్దం జరిగింది. తీరా, 2023 ఎన్నికల సమయానికి రాజగోపాల్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయనకు సుతారాము ఇష్టంలేని రేవంత్ రెడ్డి సీఎం కావడంతో పాటు, తాను ఆశించిన మంత్రి పదవి కూడా దక్కలేదు. విస్తరణలో అవకాశం వస్తుందని భావిస్తున్నారు.

మంత్రివర్గ విస్తరణ ఆలస్యం కావడం, వివిధ మార్గాల్లో తనకు అవకాశం రాకపోవచ్చన్న సమాచారం అందడం వంటి కారణాల నేపథ్యంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలో అసహనం పెరిగిపోయినట్లు కనిపిస్తోందంటున్నారు. ఈ కారణంగానే, కాంగ్రెస్ లో ఆయన వివాదాల తేనెతుట్టెను కదిలించారని అభిప్రాయ పడుతున్నారు.

కాంగ్రెస్ కు కొత్తేం కాదు..!

అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో సీఎంలను మార్చడం కాంగ్రెస్ కు కొత్త విషయమేమి కాదు. ఒక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించే మాట్లాడుకుంటే.. 1957లో ఇద్దరు సీఎంలు, 1962లో ఇద్దరు, 1978 లో నలుగురు, 1989లో ముగ్గురు, 2009లో నాటి సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హఠాన్మరణం తర్వాత కొణిజేటి రోశయ్య, ఆయనను మార్చి ఎన్.కిరణ్ కుమార్ రెడ్డి ఇలా సీఎంలను మార్చివేస్తూ వచ్చింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత పదేళ్లకు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ లో ఇపుడు సీఎం మార్పుపై ప్రచారం జరుగుతోంది. పార్టీ అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు అవుతోంది. నిండా ఏడాది గడవక ముందే జరుగుతున్న ఈ ప్రచారంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

( రిపోర్టింగ్ : క్రాంతిపద్మ, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి నల్గొండ ప్రతినిధి )

Read Entire Article