Telugu Student Dies in USA : చికాగోలో కాల్పులు - ఖమ్మం విద్యార్థి మృతి, శోకసంద్రంలో కుటుంబం

3 weeks ago 31
ARTICLE AD

ఆ తల్లిదండ్రుల ఆశలు ఆవిరయ్యాయి…! పొరుగు దేశం వెళ్లిన తమ పుత్రుడు ఎంతో గొప్ప ప్రయోజకుడవుతాడని ఆ అమ్మా, నాన్నలు కన్న కలలు కల్లలుగానే మిగిలిపోయాయి. అమెరికాలో శనివారం తెల్లవారు జామున జరిగిన విచక్షణారహిత కాల్పుల్లో ఖమ్మం జిల్లాకు చెందిన ఓ విద్యార్థి సాయితేజ మృత్యువాత పడ్డాడు.

ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం రామన్నపేట గ్రామానికి చెందిన నూకారపు కోటేశ్వరరావుకు ఒక కుమారుడు సాయి తేజ(22) ఉన్నాడు. కాగా కొడుకుని గొప్ప చదువులు చదివించి గొప్ప వాడిగా చూడాలనుకున్న ఆ తల్లిదండ్రులు అమెరికా పంపాలని నిర్ణయించారు. అనుకున్నదే తడవుగా చకచకా ఏర్పాట్లు పూర్తి చేసుకుని గత మూడు నెలల కిందటే అమెరికా విమానం ఎక్కించారు.

అక్కడ తమ కుమారుడు ఉన్నత చదువులు చదువుకుంటూ ఖర్చుల నిమిత్తం ఓ చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాడన్న భరోసాతో ఆ తల్లిదండ్రులు ఉన్నారు. సాయి తేజ షాపింగ్ మాల్ లో పార్ట్ టైమ్ పని చేస్తూ అక్కడ కళాశాలలో ఎమ్మెస్ చదువుకుంటున్నాడు.

ఇంతలోనే పిడుగులాంటి వార్త..

తమ కొడుకు అమెరికాలో చదువుకుంటున్నాడని బంధువులతో చెప్పుకుని మురిసిపోయిన ఆ ఆనందం మూడు నెలలు తిరిగేసరికి ఆవిరైపోయింది. రాత్రి ప్రశాంతంగా నిద్రించిన వారికి తెల్లవారేలోపే పిడుగులాంటి వార్త చెవిన పడింది.

శనివారం కొంతమంది ఉగ్రవాదులు షాపింగ్ మాల్ లోకి వచ్చి సాయి తేజ పై కాల్పులు జరిపి షాప్ లో నగదు దోచుకెళ్లారు. హఠాత్తుగా చోటుచేసుకున్న ఈ ఘటనలో సాయి తేజ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అనుకున్న తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. దీంతో ఖమ్మం జిల్లా రామన్నపేట గ్రామం శోకసంద్రంలో మునిగిపోయింది.

రిపోర్టింగ్ - కాపర్తి నరేంద్ర, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి.

Whats_app_banner

Read Entire Article