ARTICLE AD
TG AP Rains : తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. రానున్న మూడు రోజుల్లో హైదరాబాద్ పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదివారం హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్‌నగర్, కూకట్‌పల్లి, ఆల్విన్ కాలనీతో పాటు సిటీలోని పలు ప్రాంతాల్లో భారీవర్షం కురిసింది. పలు జిల్లాల్లో బలమైన ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ఆవర్తనం ప్రభావంతో ఉత్తర ఒడిశా తీరానికి సమీపంలో వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రస్తుతం అల్పపీడనం సముద్ర మట్టానికి 5.8 కిలో మీటర్ల ఎత్తులో ఉందని పేర్కొంది. వచ్చే రెండురోజుల్లో వాయవ్య దిశగా కదిలే అవకాశం ఉందని తెలిపింది.
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ జిల్లాల్లో వర్షాలు
ఆదివారం నుంచి సోమవారం వరకు ఖమ్మం, మలుగు, కొత్తగూడెం, నల్గొండ, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. జులై 2 వరకు ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. గత 24 గంటల్లో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, జగిత్యాల, కొత్తగూడెం, మంచిర్యాలతో పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడ్డాయి. అత్యధికంగా కొత్తగూడెం జిల్లా ములకలపల్లిలో 87 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది.
ఏపీలో మరో రెండు రోజులు వర్షాలు
ఏపీలోని రానున్న రెండు రోజులు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. కోస్తాలో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం తెలిపింది. తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని స్థానిక వాతావరణ కేంద్రం ప్రకటించింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ద్రోణి ప్రభావంతో విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, వైయస్‌ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.