ARTICLE AD
Telangana Crop Loan Waiver : రుణమాఫీ స్కీమ్ పై తెలంగాణ సర్కార్ కసరత్తు చేస్తోంది. ఆగస్టు 15వ తేదీలోపు రూ. 2 లక్షల లోపు రైతు రుణాలను మాఫీ చేస్తామని గత కొద్దిరోజుల కిందట సీఎం రేవంత్ రెడ్డి పదే పదే చెప్పిన సంగతి తెలిసిందే. ఎన్నికలు ముగియటంతో రుణమాఫీపై రేవంత్ సర్కార్…గట్టిగా ఫోకస్ చేసే పనిలో పడింది.
రుణమాఫీ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టమైన ప్రకటన చేసిన నేపథ్యంలో… ఏ విధంగా అమలు చేస్తారనే దానిపై రైతుల్లో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా కటాఫ్ తేదీ ఎలా ఉంటుందనే దానిపై చర్చ జరుగుతోంది. దీనికితోడు ఏకకాలంలో రైతుల రుణమాఫీ ఎలా సాధ్యమవుతుందనేది కూడా చర్చనీయాంశంగా మారింది. దీనిపై ప్రతిపక్ష పార్టీల నుంచే అనేక ప్రశ్నలు ఎదురవుతున్నాయి. అయితే రేవంత్ సర్కార్ మాత్రం…. ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేస్తామని చెబుతున్నారు.
కేబినెట్ భేటీ - గైడ్ లెన్స్ పై చర్చ…!
రూ. 2 లక్షల రుణమాఫీ కోసం రూపొందించే విధివిధానాలపై సర్కార్ ఇప్పటికే ప్రాథమికంగా ఓ అంచనాకు వచ్చినట్లు సమాచారం. అయితే ఈ వారంలోనే మంత్రివర్గం సమావేశం అవుతుందని తెలుస్తోంది. ఇందులో ప్రధానంగా రుణమాఫీపై చర్చించేందుకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమవుతున్నారని ప్రభుత్వ వర్గాల మేరకు తెలుస్తోంది.
ప్రస్తుతం ఉన్న రుణాలు ఎన్ని…? కటాఫ్ తేదీని నిర్ణయించటం, అధిక సంఖ్యలో రైతులకు లబ్ధి చేకూర్చే మార్గాలపై కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉంది. దాదాపు ఈ సమావేశం తర్వాత…. కీలక ప్రకటన వెలువడే ఛాన్స్ ఉంది. అయితే రుణమాఫీ గైడ్ లైన్స్ విషయంలో ప్రభుత్వం సరికొత్త ఫార్ములాను కూడా పరిశీలిస్తోందని సమాచారం..!
రుణమాఫీ స్కీమ్ లో లబ్ధిదారులుగా ఎవరిని గుర్తించాలి..? ఎలాంటి రుణాలకు ఈ స్కీమ్ ను వర్తించాలనే దానిపై కూడా సర్కార్ పలు ఆలోచనలు చేస్తోంది. అయితే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ మార్గదర్శకాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ స్కీమ్ లో కింద అర్హులైన రైతులందరికీ ప్రతి ఏడాది రూ.6 వేల పంట పెట్టుబడి సాయం అందిస్తోంది.
అయితే ఈ స్కీమ్ ప్రభుత్వ ఉద్యోగులతో పాటు పన్నులు చెల్లించే వారికి వర్తించదు. కేవలం రైతులకు మాత్రం వర్తిస్తుంది. ఇక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వంలో పలు పదవుల్లో ఉండే వారిని కూడా ఈ స్కీమ్ ను మినహాయించారు. వీటితో పాటు మరికొన్ని మార్గదర్శకాలు కూడా ఈ స్కీమ్ కు సంబంధించి ఉన్నాయి.
తాజాగా రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ చేసేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో కిసాన్ సమ్మాన్ నిధి(పీఎం కిసాన్ ) మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకుంటే ఎలా ఉంటుంది..? ఫలితంగా అసలు రైతులకు మేలు జరుగుతుందా..? ఈ స్కీమ్ ను విజయవంతంగా అమలు చేయటంలో ఈ గైడ్ లైన్స్ ఎంతవరకు పని చేస్తాయనే దానిపై కూడా తెలంగాణ ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తోంది. ఇవే కాకుండా…. రుణమాఫీ డబ్బులను ఏ విధంగా చెల్లించాలనే దానిపై కూడా సర్కార్ పలు ఫార్ములాలను పరిశీలించినట్లు సమాచారం.
ప్రభుత్వం ముందు అనేక మార్గాలు ఉండగా.. వీటిన్నింటిపై కేబినెట్ లో సమగ్రంగా చర్చించి… ఓ నిర్మయం తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది. రేపోమాపో కేబినెట్ భేటీకి సంబంధించి ప్రకటన వెలువడే అవకాశం ఉంది. మంత్రివర్గ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించిన తర్వాతే…. ప్రకటన వెలువడే అవకాశం ఉంది.