ARTICLE AD
TG Crop loans: తెలంగాణలో పంట రుణాల మాఫీ అన్నదాతలను ఆనందానికి, మరోవైపు ఆందోళనకు గురి చేస్తోంది.
రైతు రుణమాఫీ పథకంపై కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు
TG Crop loans: పంట రుణాల మాఫీతో రైతన్నలో సంబురాలతో పాటు కొందరిలో ఆందోళన నెలకొంది. లక్ష, లక్షన్నర రుణం ఉన్నా మాఫీ జాబితాలో పేర్లు లేక పోవడంతో రైతన్నను కలవరపెడుతోంది. ఫస్ట్, సెకండ్ జాబితాలో లక్షన్నర వరకు క్రాప్ లోన్ ఉన్నా మాఫీ కాకపోవడం అన్నదాతలు ఆవేదనతో ఆందోళన చెందుతున్నారు. అధికారుల చుట్టూ తిరిగే దుస్థితి ఏర్పడింది. చిన్న చిన్న సమస్యలను షాకు గా చూపి చాలామంది రైతులను రుణం మాఫీకి దూరం చేస్తుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
రెండు విడతల్లో రాష్ట్ర వ్యాప్తంగా 17 లక్షల 75 వేల మంది రైతులకు సంబంధించి 12 వేల 225 కోట్లు ప్రభుత్వం పంట రుణాలను మాఫీ చేసింది. తొలి విడత ఈనెల 18న లక్ష రూపాయల వరకు 11 లక్షల 34 వేలమంది రైతులకు 6035 కోట్లు మాఫీ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వారాల వ్యవధిలోనే రెండో విడత లక్షన్నర లోపు లోన్ ఉన్న 6 లక్షల 41 వేల మంది రైతులకు సంబంధించి 6190 కోట్లు మాఫీ చేసి మూడో విడత రెండు లక్షల వరకు రుణాలను మాఫీ చేసే పనిలో నిమగ్నమయ్యింది.
రైతుల రుణ మాఫీ కావడం సర్వత్ర హర్షం వ్యక్తం అవుతున్నా రెండు విడతల్లో లక్ష 50 వేల లోపు లోన్ ఉన్న వారి చాలామంది రైతుల పేర్లు మాఫీ జాబితాలో లేకపోవడం ఆందోళనకు గురిచేస్తుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెండు విడతల్లో లక్ష 94 వేల మంది రైతులు రుణ మాఫీ తో రుణవిముక్తులు కాగా ఇంకా చాలామంది రైతులు అనర్హులుగానే మిగిలారు. ప్రతి గ్రామంలో పదుల సంఖ్యలో రుణమాఫీకి నోచుకోని రైతులు ఉండడం సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతుంది.
అనర్హతకు రేషన్ కార్డే కారణమా?
రెండు విడతలుగా లక్షా 50 వేల వరకు పంట రుణాలు ఉన్న రైతుల లోన్ మాఫీ చేసిన ప్రభుత్వం ప్రకటించిన జాబితాలో పేర్లు లేని రైతులు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. రుణ మాఫీ ఎందుకు కాలేదో ఆరా తీస్తున్నారు. రేషన్ కార్డు లేని రైతుల పేర్లు రుణమాఫీ జాబితాలో లేవు. రేషన్ కార్డు ప్రమాణికం కాదని ప్రభుత్వం చెబుతున్నా... ఆచరణలో మాత్రం అందుకు విరుద్ధంగా ఉందని స్పష్టం అవుతుంది.
రేషన్ కార్డు కేవలం కుటుంబ సభ్యుల నిర్ధారణ కోసమే రేషన్ కార్డును పరిగణలోకి తీసుకుంటామని ప్రభుత్వం చెప్పినప్పటికీ రేషన్ కార్డు లేని రైతుల పేర్లు రుణమాఫీ జాబితాలో లేకపోవడం అన్నదాతలను ఆందోళనకు గురిచేస్తుంది. రేషన్ కార్డు తో పాటు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ఇప్పటివరకు అందుకోని రైతుల పేర్లు సైతం రుణమాఫీ జాబితాలో చోటు లభించలేదు.
క్రాప్ లోన్ ఉన్న రైతు బ్యాంక్ ఖాతా పేరుకు ఆధార్ కార్డులో ఉన్న పేరుకు మ్యాచ్ కాని రైతులు సైతం రుణమాఫీ నోచుకోని పరిస్థితి కనిపిస్తుంది. రెండు విడతల్లో ఒక్క ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే సుమారు లక్ష మందికి రుణమాఫీని నోచుకోలేదనే ఫిర్యాదులు వెల్లువెత్తున్నాయి. రెండు జాబితాలో పేర్లు రాని రైతులు వ్యవసాయ శాఖ అధికారుల చుట్టూ అధికార పార్టీ నేతల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది.
రేషన్ కార్డు ప్రమాణికమైతే తాము ఎప్పుడో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నామని రేషన్ కార్డులు ఇవ్వకుండా ఇప్పుడు రేషన్ కార్డుతో రుణమాఫీ లింక్ పెట్టి ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సమంజసమని రైతన్నలు ప్రశ్నిస్తున్నారు. కొత్త రేషన్ కార్డులు ఇవ్వడంలో మీనమేషాలు లెక్కిస్తున్న ప్రభుత్వం రేషన్ కార్డు లేని రైతులకు సైతం రుణమాఫీ వర్తింపజేయాలని రైతు సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు.
కాంగ్రెస్ ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల వరకు పంట రుణం ఉన్న ప్రతి రైతుకు రుణమాఫీ చేయాలని కోరుతున్నారు. రుణమాఫీ నుంచి తప్పించుకోవాలని ప్రభుత్వం పొంతనలేని నిబంధనలు పెట్టి రైతులను ఇబ్బంది పెడితే ఆందోళన చేయక తప్పదని రైతు సంఘాల ప్రతినిధులు, బిఆర్ఎస్, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నాయకులు హెచ్చరిస్తున్నారు.
రెండవ విడత రైతు రుణమాఫీ నిధుల విడుదల పెద్దపల్లి కలెక్టరేట్ రుణమాఫీ లబ్దిదారులతో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ రెండు విడతల్లో పెద్దపల్లి జిల్లాలో 42 వేల 965 మంది రైతులకు 271 కోట్ల రుణమాఫీ అయిందని తెలిపారు. చాలా మంది రైతుల పేర్లు రుణమాఫీ జాబితాలో లేవని ఫిర్యాదులు అందుతున్నాయని కలెక్టర్ చెప్పారు. జిల్లాలో ఫిర్యాదుల నమోదు కోసం ప్రత్యేకంగా కలెక్టరేట్ లో టోల్ ఫ్రీ నెంబర్ సైతం ఏర్పాటు చేశామని, రుణమాఫీ పథకంపై రైతులు తమ సందేహాలను 18005995459 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా నమోదు చేయాలని కలెక్టర్ కోరారు.
తమ దృష్టికి వచ్చిన ఫిర్యాదులను 30 రోజులలో పరిష్కరించడం జరుగుతుందని స్పష్టం చేశారు. రేషన్ కార్డు రైతు రుణమాఫీ అమలుకు తప్పనిసరి కాదని, రైతు కుటుంబాన్ని గుర్తించేందుకు ఒక ప్రామాణికంగా మాత్రమే రేషన్ కార్డును వినియోగిస్తున్నామని తెలిపారు. భూమి ఉన్న ప్రతి రైతు కుటుంబానికి రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ పథకం అమలు అవుతుందన్నారు.
2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 వరకు రైతులు నూతనంగా తీసుకున్న రుణాలు, రెన్యువల్ చేసుకున్న రుణాలు అసలు, వడ్డీ కలిపి 2 లక్షల రూపాయల వరకు ప్రతి రైతు కుటుంబానికి మాఫీ జరుగుతుందని, రైతు కుటుంబానికి రెండు లక్షల కంటే అధికంగా రుణం ఉన్నట్లయితే కుటుంబంలోని మహిళ పేరు పై రుణాలు నిబంధనల మేరకు ముందుగా మాఫీ అవుతాయని కలెక్టర్ ప్రకటించారు.
ఆందోళన చెందవద్దు…
రెండు విడతల్లో రుణమాఫీ జాబితాలో పేర్లు లేని అర్హులైన రైతులు ఆందోళన చెందవద్దని అధికార పార్టీ నాయకులతోపాటు వ్యవసాయ శాఖ అధికారులు కోరుతున్నారు. అర్హులైన రైతుల రుణం మాఫీ కాకుంటే సంబంధిత ఏ ఈ ఓ లేదా మండల వ్యవసాయ శాఖ అధికారుల వద్ద దరఖాస్తు చేసుకోవాలని కోరుతున్నారు.
ఆదాయ పన్ను చెల్లించేవారు.. ప్రభుత్వం ఉద్యోగులు మాత్రమే రైతు రుణమాఫీకి అర్హులుకాదని స్పష్టం చేస్తున్నారు. సన్న చిన్నకారు రైతులకు తప్పక రుణమాఫీ అవుతుందని ప్రస్తుతం జాబితాలో పేరు లేదని ఆందోళన గురి కావద్దని సూచిస్తున్నారు. అర్హత ఉండి రుణమాఫీ కాకుంటే ఏఈవో వద్ద దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి సమస్యను పరిష్కరించడం జరుగుతుందని వ్యవసాయ శాఖ అధికారులతో పాటు అధికార పార్టీ నాయకులు చెబుతున్నారు. మరీ వారి మాటలు ఏం మేరకు నెరవేరుతాయోనని అన్నదాతలు ఆశగా ఎదురుచూసే పరిస్థితి ఏర్పడింది.
(రిపోర్టింగ్ కె.వి.రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)