ARTICLE AD
తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు దీపావళి పండుగ సందర్భంగా గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు 3.64 శాతం కరవు భత్యం(డీఏ) పెంచుతూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. 2022 జులై 1వ తేదీ నుంచి డీఏ పెంపు వర్తిస్తుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. నవంబర్ జీతంతో కలిపి పెరిగిన డీఏ చెల్లించనున్నారు. 2022 జులై 1వ తేదీ నుంచి అక్టోబర్ 31, 2024 వరకు డీఏ బకాయిలు జీపీఎఫ్ ఖాతాలో జమ చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
ఉద్యోగులు, పెన్షనర్ల డీఏ పెంపు
సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇటీవల కేబినెట్ సమావేశంలో ఉద్యోగులు, పెన్షనర్ల డీఏ పెంపుపై నిర్ణయం తీసుకున్నారు. తాజాగా ప్రభుత్వం ఈ నిర్ణయం మేరకు డీఏ పెంపుపై జీవోలు 120, 121 జారీ చేసింది. మార్చి 31, 2025వ తేదీ లోపు పదవీ విరమణ చేసే ఉద్యోగులకు డీఏ బకాయిలను 17 సమాన వాయిదాల్లో చెల్లిస్తామని ప్రభుత్వం తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది.
డీఏ బకాయిలు
అలాగే సీపీఎస్ ఉద్యోగులకు డీఏ బకాయిలు 10 శాతం ప్రాన్ ఖాతాకు జమచేయన్నట్లు ప్రభుత్వం తెలిపింది. మిగిలిన 90 శాతం వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి 17 సమాన వాయిదాల్లో సీపీఎస్ ఉద్యోగులకు చెల్లించనున్నారు. జీపీఎఫ్ ఖాతాలు లేని ఫుల్ టైం కంటింజెంట్ ఉద్యోగులకు వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి 17 సమాన వాయిదాల్లో డీఏ చెల్లింపులు చేపట్టనున్నారు. 2025 జనవరి నుంచి రిటైర్డ్ ఉద్యోగులకు 17 సమాన వాయిదాల్లో డీఏ బకాయిలు చెల్లించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది.
గత కొన్ని రోజులుగా తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులు పెండింగ్ డీఏలతోపాటు మెడికల్ బిల్లులు, ఈహెచ్ఎస్ స్కీమ్, ఎన్నికల సమయంలో బదిలీ అయిన ఉద్యోగులను తిరిగి పాత స్థానాల్లో పంపించడంపై ఆందోళన చేస్తున్నారు. దీంతో పాటు ముఖ్యంగా సీపీఎస్ రద్దు సహా మొత్తం 50 సమస్యలపై ఆందోళన చేస్తున్నారు. ఈ సమస్యలపై ప్రభుత్వం తాజాగా ఉద్యోగులతో చర్చలు జరిపింది. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రకటించింది. అక్టోబర్ 26న జరిగిన కేబినెట్ సమావేశంలో డీఏ పెంపుపై నిర్ణయం తీసుకుంది. పెండింగ్ ఉన్న రెండు డీఏల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీపావళి పండగ సందర్భంగా ఒక డీఏ విడుదలకు తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డీఏ పెంపుపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.