TG Govt Employees : ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ సర్కారు గుడ్‌న్యూస్.. ఆ ఫైలుపై సీఎం సంతకం!

3 weeks ago 32
ARTICLE AD

తెలంగాణలో జీవో 317 కారణంగా నష్టపోయిన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు రేవంత్ సర్కారు త్వరలోనే శుభవార్త చెప్పే అవకాశం ఉంది. ఈ జీవో అమలుతో ఇబ్బందులకు గురైన భార్యాభర్తలు, మ్యూచువల్, అనారోగ్య కారణాలున్న ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన ఫైలుపై సీఎం రేవంత్ సంతకం చేసినట్టు సమాచారం.

317 జీవోపై ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. ఆ సబ్ కమిటీ మ్యూచువల్, హెల్త్ గ్రొండ్, స్పౌజ్ ట్రాన్స్‌ఫర్లు జరపాలని కొన్ని రోజుల కిందట ప్రాథమికంగా నిర్ణయించింది. దీనికి సంబంధించిన ఫైలును సీఎం రేవంత్ రెడ్డికి పంపగా.. శుక్రవారమే దాన్ని ఆమోదించినట్టు తెలుస్తోంది. అతి త్వరలోనే దీనిపై ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.

వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ అధ్యక్షతన ఇటీవల సచివాలయంలో ఉపసంఘం సమావేశమైంది. స్థానికత ప్రకారం ఉద్యోగుల కేటాయింపుపై సుదీర్ఘంగా చర్చించింది. న్యాయ వివాదాలకు తావు లేకుండా కేటాయింపు జరగాలని అభిప్రాయపడింది. స్థానికతకు అవరోధంగా ఉన్న క్లాజ్‌లపై మంత్రులు రాజనర్సింహ, శ్రీధర్‌బాబు 3 గంటలకుపైగా న్యాయ నిపుణులతో చర్చించారు.

ఉద్యోగ, ఉపాధ్యాయుల అభిప్రాయాలను వినతుల రూపంలో ప్రత్యక్షంగా, వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తులను కేబినెట్ సబ్ కమిటీ స్వీకరించింది. సమస్యల పరిష్కారానికి కేబినెట్ సబ్ కమిటీ వివిధ శాఖల ఉన్నతాధికారులతో పలు దఫాలుగా సమీక్షలు నిర్వహించింది. తుది నివేదిక పత్రాలను రూపొందించింది. ఈ నివేదిక పత్రాలను సీల్డ్ కవర్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి దామోదర రాజనర్సింహా ఇటీవల అందజేశారు.

అంతకుముందు పలు దఫాలుగా సబ్ కమిటీ భేటీ అయ్యింది. ఆయా సందర్బంగా.. 317 జీవో కారణంగా నష్టపోయిన వారి వివరాలు మాత్రమే గుర్తించి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. దీంతో వివిధ శాఖల నుంచి వివరాలు అందాయి. అన్నింటినీ పరిశీలించి, ఉప సంఘం నివేదికను తయారు చేసింది. దాన్నే ముఖ్యమంత్రికి సమర్పించింది. అయితే.. సబ్ కమిటీ నివేదికను బయటపెట్టాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Whats_app_banner

Read Entire Article