TG Govt Skills University : తెలంగాణ స్కిల్స్ యూనివర్శిటీలో ఉద్యోగాలు - నెలకు రూ. 60 వేల జీతం, ఇలా అప్లయ్ చేసుకోండి

1 month ago 66
ARTICLE AD

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ (YISU)ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు కోర్సుల్లో ప్రవేశాలకు కూడా దరఖాస్తులను స్వీకరించింది. తొలి విడతగా నాలుగు కోర్సులను కూడా ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ యూనివర్శిటీలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది.

యంగ్ ప్రొఫెషనల్స్ పోస్టుల భర్తీ కోసం యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ప్రకటన జారీ చేసింది. మొత్తం 3 ఖాళీలు ఉన్నాయి. కాంట్రాక్ట్ ప్రాతిపాదికన భర్తీ చేస్తారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 30 ఏళ్ల లోపు ఉండాలి. ఎంపికైన వారికి రూ. 60 వేల నుంచి రూ. 70వేల మధ్య జీతం చెల్లిస్తారు.

దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల పబ్లిక్ పాలసీ, ఎకనామిక్స్ లో పీజీ చేసి ఉండాలి. లేదా ఎంబీఏ ఉత్తీర్ణత పొంది ఉండాలి. కనీసం ఒకటి నుంచి రెండేళ్లపాటు సంబంధిత విభాగంలో పని చేసిన అనుభవం కూడా ఉండాలి. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి.. షార్ట్ లిస్ట్ చేస్తారు. వారికి మెయిల్ ద్వారా సమాచారం అందించి.. ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం ఇలా…

ఆఫ్ లైన్ విధానంలో అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. https://yisu.in/careers/ నుంచి అప్లికేషన్ ఫారమ్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఇందులో మీ పూర్తి వివరాలను నింపాల్సి ఉంటుంది. విద్యార్హత పత్రాలు, పని అనుభవం పత్రాలను కలిపి సింగిల్ పీడీఎఫ్ చేయాలి. దీన్ని hr.admin@yisu.in మెయిల్ కు పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులను పంపేందుకు నవంబర్ 15,2024వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. ఆ తర్వాత పంపే దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోవటం జరగదని అధికారులు స్పష్టం చేశారు.

ఇక తొలి విడతగా తెలంగాణ స్కిల్స్ యూనివర్సిటీ ప్రాథమికంగా మూడు స్కూల్స్‌ను, వాటిల్లో నాలుగు కోర్సులను ప్రారంభిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. లాజిస్టిక్స్ అండ్ ఈ-కామర్స్, హెల్త్‌కేర్, స్కూల్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్ అండ్ లైఫ్ సైన్సెస్‌ను ఈ ఏడాది నుంచే ప్రారంభిస్తోంది. వీటిల్లో లాజిస్టిక్స్ అండ్ ఈ -కామర్స్ స్కూల్ కింద వేర్‌హౌస్ ఎగ్జిక్యూటివ్, కీ కన్సయినర్ ఎగ్జిక్యూటివ్ కోర్సులు, హెల్త్‌కేర్‌లో భాగంగా ఫినిషింగ్ స్కిల్స్ ఇన్ నర్సింగ్ ఎక్సలెన్స్, ఫార్మాస్యూటికల్స్ అండ్ లైఫ్ సైన్సెస్ కింద ఫార్మా అసోసియేట్ ప్రోగ్రామ్ కోర్సుల్లో చేరే విద్యార్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తోంది.

లాభాపేక్ష లేకుండా స్వయం ప్రతిపత్తి ఉండేలా ఈ యూనివర్శిటీని ఏర్పాటు చేసేలా తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. మూడు నాలుగేండ్ల కాల వ్యవధి ఉండే డిగ్రీ కోర్సులతో పాటు ఏడాది డిప్లొమా, మూడు నుంచి నాలుగు నెలల వ్యవధి ఉండే సర్టిఫికెట్ కోర్సులు ఇందులో నిర్వహిస్తారు. తెలంగాణలో అభివృద్ధి చెందుతున్న వివిధ రంగాలు, పరిశ్రమల భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా కొత్త కోర్సులను ఎంపిక చేశారు. మొత్తం 17 ప్రాధాన్య రంగాలను గుర్తించారు.

Whats_app_banner

Read Entire Article