ARTICLE AD
TG Land Registration Charges : తెలంగాణలో భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరుగుతున్నాయి. ఆగస్టు 1 నుంచి కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆదాయాన్ని పెంచేందుకు భూముల మార్కెట్ విలువను సవరించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి రిజిస్ట్రేషన్ ఛార్జీల సవరణ చేపడుతున్నారు. ఇప్పటికే స్టాంప్స్, రిజిస్ట్రేషన్ శాఖ రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపుపై అధ్యయనం చేపట్టింది. క్షేత్రస్థాయి అధ్యయనం అనంతరం పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో భూముల మార్కెట్ విలువను సవరించాలని నిర్ణయించింది. ఈ మేరకు స్టాంప్స్, రిజిస్ట్రేషన్ శాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది.
ఆగస్టు 1 నుంచి అమల్లోకి
రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువను సవరణకు చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి రిజిస్ట్రేషన్ శాఖను ఆదేశించారు. రాష్ట్రంలో భూముల ధరలు పెరిగినా... అందుకు తగిన విధంగా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం పెరగడంలేని గుర్తించిన ప్రభుత్వం... ఈ మేరకు రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచాలని నిర్ణయం తీసుకుంది. భూముల మార్కెట్ విలువకు, అమ్మకం ధరకు మధ్య తేడా ఉందని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2021లో భూముల విలువ, రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచిందని తెలిపారు. అయినా భూముల మార్కెట్ విలువకు, విక్రయ ధరకు భారీగా తేడా ఉందని అధికారులు గుర్తించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో దశలవారీగా విశ్లేషించి నూతన రిజిస్ట్రేషన్ ఛార్జీలు నిర్ణయించారు. జిల్లా, మండల స్థాయిల్లో అధ్యయనం తర్వాత ఆగస్టు 1 నుంచి కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు అమల్లోకి రానుంది. స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ... రెవెన్యూ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పంచాయతీ రాజ్, సర్వే శాఖల అధికారులు సమావేశాలు నిర్వహించి.. జులై 1న నూతన ఛార్జీలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. జులై 20 వరకు ప్రజల సలహాలు, అభ్యంతరాల తెలుసుకోనున్నారు. జులై 31 నాటికి కసరత్తు పూర్తి చేసి, సవరించిన ఛార్జీలను ఆగస్టు 1 నుంచి అమలులోకి తీసుకురానున్నారు.
నిబంధనల మేరకు ఏటా సవరణ
నిబంధనల ప్రకారం ప్రతి ఏటా భూముల మార్కెట్ విలువను సవరించాల్సి ఉంటుంది. అయితే ప్రతీ ఏటా ధరల సవరణలు జరగడంలేదు. ఈ విషయంపై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి... మార్కెట్ విలువలను బట్టి ధరల సవరణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు. ధరల సవరణలో రాష్ట్ర ఖజానాకు ఆదాయం రావడంతో పాటు రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాన్ని వృద్ధి చెందుతుందన్నారు.
గ్రామాల్లో ఇలా
ముందుగా జాతీయ, రాష్ట్ర రహదారులు ఉన్న గ్రామాలను గుర్తించి అక్కడ వ్యవసాయేతర పనులకు అనువైన ప్రాంతాలు, పరిశ్రమలు, సెజ్‌లు పరిగణనలోకి తీసుకుంటారు. ఆ ప్రాంతాల్లో భూముల ధరలను లెక్కగట్టి మార్కెట్ విలువను సవరిస్తారు. భూముల ధరల వ్యత్యాసాలను పరిశీలిస్తారు. జిల్లా రిజిస్ట్రార్లు, డీఐజీలు ఆ రీతుల్ని గుర్తించి ధరలు నిర్ణయిస్తారు. అలాగే వ్యవసాయ భూములకు రెవెన్యూ, పంచాయతీ అధికారుల సూచనల మేరకు బహిరంగ మార్కెట్ ధరలు నిర్ణయిస్తారు.
పట్టణాల్లో ఇలా
పట్ణణ ప్రాంతాల్లో వివిధ మార్గాల్లో మార్కెట్ విలువ నిర్ణయిస్తారు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో స్థానిక పరిస్థితులను అనుసరించి భూముల విలువను నిర్ణయిస్తారు. కమర్షియల్ ప్రాంతాలు, ప్రధాన రహదారుల ప్రాంతాల్లో మౌలిక సదుపాయల అనుగుణంగా విలువ ఉంటుంది. కాలనీలు, మౌలిక సదుపాయాలు ఉన్న ప్రాంతాల్లో పాత విలువతో పోల్చి సవరణ చేస్తారు. ఇటీవల మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో చేరిన గ్రామాలకు స్థానిక విలువను బట్టి మార్కెట్ ధరలు నిర్ణయిస్తారు.