TG Ministers: హత్యాచార బాధితురాలి కుటుంబానికి అండగా తెలంగాణ ప్రభుత్వం, నిందితుడ్ని శిక్షిస్తామని హామీ

5 months ago 88
ARTICLE AD

TG Ministers: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి రైస్ మిల్లులో ఆరేళ్ళ పాపపై అత్యాచారానికి పాల్పడిన ప్రాణం తీసిన కామాంధుడి పై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. బాధిత బాలిక కుటుంబాన్ని ఆదుకునే పనిలో ప్రభుత్వం నిమగ్నమయింది.

ఘటన జరిగిన ప్రదేశం మమత రైస్ మిల్లును మంత్రులు దుదిళ్ళ శ్రీధర్ బాబు, సీతక్క, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్యేలు విజయరమణారావు, ఎంఎస్ రాజ్ ఠాకూర్ తో కలిసి సందర్శించి పరిశీలించారు. జరిగిన ఘటనపై వివరాలు అడిగి తెలుసుకుని విచారం వ్యక్తం చేశారు.

పసిపాప తల్లిదండ్రులు నిద్రపోయే సమయంలో రైస్ మిల్లులో పని చేసే బీహర్ కు చెందిన వ్యక్తి తల్లిదండ్రుల దగ్గర నుంచి పాపను ఎత్తుకు వెళ్లి అత్యాచారం చేసి హత్య చేయడం పట్ల మంత్రులు ఆవేదన వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధిత కుటుంబానికి అండగా ఉంటుందని, అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా పోలీసు శాఖ మరింత భద్రత కల్పన, నిఘా పెంపు, డ్రగ్స్ మాదక ద్రవ్యాలు, గంజాయి వంటి దురలవాట్లకు గురైన వారిని గుర్తించి కౌన్సిలింగ్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. నేరం చేసిన వ్యక్తులకు సరైన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా పకడ్బందీగా చర్యలు చేపడుతామన్నారు. భవిష్యత్తులో పోలీసు కార్యక్రమాలు పటిష్టం చేస్తామని, బాధిత కుటుంబానికి అండగా ఉంటామని మంత్రులు పేర్కొన్నారు.

చిన్నారి బాలికను కిరాతకుడు దారుణంగా హత్య చేయడంతౌ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించిందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఈ కేసులో నిందితుడికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులో త్వరిత గతిన శిక్ష పడే విధంగా ఆధారాలు ప్రవేశపెట్టడం జరుగుతుందన్నారు.

8 లక్షల ఎక్సిగ్రేషియా.. తండ్రికీ ఉద్యోగం

రైస్ మిల్లులో హమాలీ కార్మికుడి చేతిలో బలైన ఆరేళ్ళ చిన్నారి కుటుంబానికి రైస్ మిల్ ద్వారా ఐదున్నర లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మరో రెండున్నర లక్షల పరిహారం అందిస్తున్నట్లు మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క తెలిపారు. చిన్నారి తండ్రికి ఆసిఫాబాద్ లో ఉద్యోగం కల్పిస్తామన్నారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని, ఆ తల్లిదండ్రుల వద్ద ఉన్న మరో పాప చదువు బాధ్యతలను సైతం ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు.

వలస కూలీలపై నిఘా

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో 200 పైగా రైస్ మిల్లులు ఉంటాయని ఎమ్మెల్యే విజయరమణారావు తెలిపారు. చాలా కాలంగా సీజన్ సమయంలో ఒరిస్సా, బీహార్, మధ్యప్రదేశ్ నుంచి కార్మికులు ధాన్యం కొనుగోలు సమయాల్లో వచ్చి పని చేస్తారని, ఎప్పుడు ఇలాంటి సంఘటనలు జరగలేదన్నారు.

జరిగిన ఘటనపై దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తు మిల్లులపై నిఘా పెట్టి‌ డ్రగ్స్, గంజాయి, మాదక ద్రవ్యాలకు అలవాటు పడినవారిని గమనించాలని మంత్రులు పోలీసులకు సూచించారు. డ్రగ్స్, గంజాయిని ఉక్కుపాదంతో అణిచి వేయాలనే లక్ష్యంతో తమ ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు. మనిషి ఆరోగ్యంతో పాటు సమాజానికి సైతం డ్రగ్స్, గంజాయి నష్టం చేస్తున్నాయని తెలిపారు.

(రిపోర్టింగ్ కేవీ రెడ్డి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా)

Read Entire Article