ARTICLE AD
TS Cabinet Expansion : తెలంగాణలో మంత్రి వర్గం విస్తరణపై ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుత కేబినెట్ లో సీఎంతో కలిపి మొత్తం 12 మంది మంత్రులు ఉన్నారు. సాధారణంగా ముఖ్యమంత్రితో కలిపి కేబినెట్ లో మొత్తం 18 మంది మంత్రులు ఉండొచ్చు. అంటే ఇంకా రేవంత్ కేబినెట్ లో ఆరుగురి వరకు అవకాశం ఉంది. అయితే కేబినెట్ లో చోటు దక్కించుకోవడం కోసం ఆశావహులు ప్రయత్నాలు ఇప్పటికే మొదలు పెట్టారు. మొదట్లో లోక్ సభ ఎన్నికలు అనంతరమే కేబినెట్ విస్తరణ ఉంటుందని పీసీసీ వర్గాలు వెల్లడించినా.....ఇప్పటివరకు దాని ఊసే లేదు. మిగిలిన ఆరుగురు మంత్రులను జిల్లాలు, సామాజిక వర్గం ఆధారంగా ఎంపిక చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గతంలోనే అనేక సార్లు తెలిపారు. ప్రస్తుతం కేబినెట్ లో హైదరాబాద్, రంగారెడ్డి, ఆదిలాబాద్, నిజమాబాద్ జిల్లాలకు ప్రాతినిధ్యం లేదు. వరంగల్, నల్గొండ, కరీంనగర్ నుంచి ఇద్దరు చొప్పున మంత్రులు ఉండగా......మహబూబ్ నగర్ లో ముఖ్యమంత్రితో కలిపి ఇద్దరు మంత్రులు, మెదక్ లో ఒకరు.....ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు. అయితే ఇప్పటి వరకు ప్రాతినిధ్యం లేని జిల్లాలకు అవకాశం కల్పిస్తూ......సామాజిక వర్గాల వారీగా ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు.
కేబినెట్ లో మైనారిటీ లకు ఛాన్స్....బీసీ, ఎస్సీల సంఖ్య పెంపు?
ఇక భాగ్యనగరం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరూ లేకపోవడంతో......బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యేను కాంగ్రెస్ కు చేర్చుకుని ఆయనకు మంత్రి పదవి కట్టబెడతారని సమాచారం. రంగారెడ్డి నుంచి పరిగి శాసన సభ్యులు రామ్మోహన్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి పోటీ పడుతున్నారు. నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలో కూడా ఇద్దరు చొప్పున కాంగ్రెస్ నేతలు తమకే మంత్రి పదవి ఇవ్వాలని హైకమాండ్ తో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న కేబినెట్ లో సామాజిక వర్గాల ఈక్వేషన్ పరిశీలిస్తే......సీఎం రేవంత్ రెడ్డితో కలిపి ఓసీ వర్గానికి చెందిన మంత్రులు మొత్తం ఏడుగురు ఉండగా.....ఇద్దరు బీసీ, ఇద్దరు ఎస్సీ, ఒక్క ఎస్టీ మంత్రి ఉన్నారు. కేబినెట్ లో మైనారిటీ నేతలు లేకపోవడంతో ఆ వర్గానికి చెందిన వారికి దక్కే అవకాశం ఉంది. ఇటు బీసీ, ఎస్సీల సంఖ్య కూడా కేబినెట్ లో పెంచనునట్టు తెలుస్తుంది.
అభిప్రాయాలు సేకరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి
ఇదిలా ఉంటే మంత్రి వర్గ విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి అభిప్రాయాలను సేకరిస్తున్నారట. లోక్ సభ ఎన్నికల ఫలితాలు అనంతరం చేద్దామా? లేక స్థానిక సంస్థల ఎన్నికలు ముగిశాక చేద్దామా ? అని సీఎం మంత్రులను, ఎమ్మెల్యేలను అడుగుతున్నారట. మరోవైపు పీసీసీ పదవికి కూడా ఆశావహుల సంఖ్య పెరిపోయింది. లోక్ సభ ఎన్నికల అనంతరం రేవంత్ రెడ్డి పూర్తిగా సీఎం బాధ్యతలు తీసుకుంటారని, ఆయన స్థానంలో మరొకరిని పీసీసీ అధ్యక్షుడిగా నియమిస్తామని కాంగ్రెస్ అధిష్టానం గతంలోనే స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే ఆ పదవిని దక్కించుకోవడం కోసం నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. పీసీసీ రేసులో ప్రధానంగా మధు యాష్కీ గౌడ్, అద్దంకి దయాకర్, సంపత్ కుమార్, జగ్గారెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, రాజా గోపాల్ రెడ్డి ఉన్నారు.
రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా