ARTICLE AD
Vegetable Prices in Telangana : రాష్ట్రంలో కూరగాయలు ధరలు మండిపోతున్నాయి.డిమాండ్ తగ్గట్టు ఉత్పత్తి లేకపోవడంతో కూరగాయ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ ఏడాది వేసవిలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో…. కూరగాయల ఉత్పత్తి తగ్గిపోయింది.
ఇక మే మాసంలో సగం రోజులు పూర్తి అయ్యాక రాష్ట్రంలో వర్షాలు మొదలయ్యాయి. దీంతో సీన్ క్రమంగా మారిపోయింది. వానలతో తడిసిపోవటంతో పాటు త్వరగా కుళ్లిపోవటం సమస్యగా మారింది. దీనికితోడు పక్క రాష్ట్రాల నుంచి కూరగాయలను తెస్తున్న సమయంలో అనేక ఇబ్బందులు తలెత్తున్నాయి.
వానలతో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు సంభవిస్తున్నాయి. దీంతో త్వరగా కూరగాయలు కుళ్లిపోతుండటంతో వ్యాపారస్తులు దిగుమతులను క్రమంగా తగ్గిస్తూ వచ్చారు. రాష్ట్రంలో కూడా కూరగాయల సాగు తగ్గింది. వీటి ప్రభావంతో ప్రస్తుతం మార్కెట్ లో కూరగాయల ధరలు భారీగా పెరిగాయి. చేతినిండా డబ్బులు తీసుకెళ్లిన సంచి సగానికి కూడా కూరగాయలు రావట్లేదంటూ సామాన్యులు వాపోతున్నారు.
ధరలు ఇలా ఉన్నాయి…
ఇక హైదరాబాద్ నగరంలో చూస్తే… రైతుబజార్లలోని ధరలతో పోలిస్తే బహిరంగ మార్కెట్లలో 30 శాతం 50 శాతం వరకు ధరలు అధికంగానే ఉన్నాయి. ప్రస్తుతం కేజీ ఉల్లి ధర రూ. 35గా ఉంటే... ఓపెన్ మార్కెట్ లో రూ. 40 నుంచి 45 వరకు పలుకుతోంది.
ఇక టమాట ధరలు భారీగా పెరిగాయి. ఏకంగా కేజీ ధర రూ. 40 నుంచి 50 మధ్య నడుస్తోంది. పచ్చిమిర్చి ధర రూ. 65 నుంచి 80 మధ్య ఉంది. ఇక బీన్స్ ధర చెప్పలేనంత స్థాయిలో పలుకుతోంది. కిలో ధర రూ. 110 నుంచి 120 మధ్య విక్రయిస్తున్నారు. ఇక చిక్కుడ ధర రూ. 50 నుంచి 60 మధ్య ఉంది. బెండకాయ కిలో ధర రూ. 50 - 60 మధ్య ఉంది. క్యాప్సికం, పుదీనా, కొత్తిమీర ఇతర ఆకుకూరల ధరలు కూడా రెట్టింపయ్యాయి.
ప్రస్తుతం రాష్ట్రంలో వానకాలం సాగు నడుస్తోంది. ఇందుకు సంబంధించి పంట జూలై, ఆగస్టు మాసంలో చేతికి వస్తుంది. వీటి ఉత్పత్తులు మార్కెట్లకు చేరితే… మళ్లీ ధరలు తగ్గే అవకాశం ఉంటుందని వ్యాపారులు చెబుతున్నారు.
ఏపీలోనూ అంతే….
Vegetable Rates in AP: ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాలోనూ కూరగాయల ధరలు పెరిగాయి. తూర్పుగోదావరి జిల్లాల్లో ధరలు చూస్తే ఆకాశాన్ని అంటుతున్నాయి. ధరల మంటకు సామాన్యుల కల్లల్లో నీరు తిరుగుతుంది. అమాంతం పెరిగిన నిత్యావసర వస్తువులను ధరలను చూసి సామాన్యులు విలవిలలాడుతున్నారు.
ఇటీవలి కురిసిన అకాల వర్షాల వల్లే కూరగాయల ధలకు రెక్కలు వచ్చాయని రైతులు, విక్రయదారులు పేర్కొంటున్నారు. కూరగాయలు, ఇతర వంట సరుకుల ధరలు సామాన్యుని వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. ఏం కొనేటట్టు లేదు...ఏం తినేటట్టు లేదు అన్న పరిస్థితి నెలకొంది. వారం రోజుల్లోనే రిటైల్ మార్కెట్లో కూరగాయల ధరలు భారీగా పెరిగాయి. దీంతో పేద, మధ్య తరగతి ప్రజలు బెంబేలెత్తుతున్నారు. కొన్నింటి ధరలు మూడు, నాలుగు రెట్లు కూడా పెరిగాయి.
వారం క్రితం వరకూ కిలో టమాటా రూ.20 ఉండగా, ప్రస్తుతం అది మూడింతలు పెరిగి రూ.60కు చేరింది. పచ్చిమిర్చిని ముట్టుకుంటే ధర ఘాటు పుట్టిస్తోంది. వారం రోజుల క్రితం కిలో పచ్చిమిర్చి రూ.60 ఉండగా, ప్రస్తుతం అది రూ.100కు చేరింది. కేజీ ఉల్లి ధర గత వారం రూ.22 ఉండగా, ప్రస్తుతం అది రూ.50కి చేరింది. కేజీ చిక్కుళ్లు ధర గత వారం రూ.40 ఉండగా, ఇప్పుడది రూ.120కి చేరింది. క్యాప్సికమ్ కేజీ రూ.60 నుంచి రూ.100కు పెరిగింది. బీరకాయ ధర గత వారంలో కేజీ రూ.60 ఉండగా, ప్రస్తుతం రూ.100కి చేరింది.