Warangal Mayor: గ్రేటర్ వరంగల్ మేయర్ కు అవిశ్వాస గండం!BRS, BJP కార్పొరేటర్ల భేటీ

5 months ago 92
ARTICLE AD

Warangal Mayor: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గుండు సుధారాణికి అవిశ్వాస గండం పొంచి ఉంది. ఆమెను గద్దె దించాలని గతం నుంచే ప్రయత్నాలు చేస్తుండగా, మంగళవారం బీఆర్ఎస్, బీజేపీ కార్పొరేటర్లు మున్సిపల్ కౌన్సిల్ హాలులోనే సమావేశం పెట్టుకున్నారు.

ప్రస్తుతం గుండు సుధారాణి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతుండగా, ఆ ఒక్క పార్టీకి చెందిన కార్పొరేటర్లు మినహా మిగతా బీఆర్ఎస్, బీజేపీ కార్పొరేటర్లు సమావేశమై అవిశ్వాస నిర్ణయం తీసుకోగా, వరంగల్ నగరంలో ఇప్పుడిదే హాట్ టాపిక్ గా మారింది. ఇదిలాఉంటే పదవీ గండం పొంచి ఉందనే ఉద్దేశంతోనే గులాబీ పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి ఎంట్రీ ఇచ్చిన సుధారాణికి ఇప్పుడు ఆమె అంటే గిట్టని కార్పొరేటర్లతో అవిశ్వాస ముప్పు పొంచి ఉండటంతో మేయర్ కాస్త ఆందోళనలో పడినట్లు తెలుస్తోంది.

పార్టీ మారినా తొలగని ముప్పు

గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి 2021 ఏప్రిల్ లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున 29వ డివిజన్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. అనంతరం గులాబీ పార్టీ పెద్దల సహకారంతో అనూహ్యంగా మేయర్ పీఠాన్ని దక్కించుకున్నారు. దీంతో బీఆర్ఎస్ నుంచి మేయర్ పదవిని ఆశించిన మిగతా కార్పొరేటర్లంతా తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. అప్పటినుంచి ఆమె తీరుపై అసహనంతోనే కొనసాగుతున్నారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తరువాత ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ అడ్రస్ గల్లంతవగా, కొంతమంది కార్పొరేటర్లు కూడా కండువాలు మార్చారు. బీఆర్ఎస్ లో మేయర్ తీరు నచ్చక కాంగ్రెస్ లో చేరారు. దీంతో గ్రేటర్ బీఆర్ఎస్ బలహీన పడగా, మేయర్ కూడా సెల్ఫ్ డిఫెన్స్ లో పడ్డారు. కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లతో తన పదవికి గండం పొంచి ఉందనే ఆలోచనతో నాటకీయ పరిణామాల నడుమ సుధారాణి కూడా హస్తం గూటికి చేరారు.

దీంతో ఆమె తీరు నచ్చక కాంగ్రెస్ లో చేరిన కార్పొరేటర్లు మేయర్ హస్తం పార్టీలోకి రావడాన్ని వ్యతిరేకించారు. కానీ అధిష్ఠానం ఆమెను పార్టీలో చేర్చుకోగా.. పార్టీ మారిన మేయర్ పీడ తప్పలేదనే భావనతో కొందరు కాంగ్రెస్ కార్పొరేటర్లు కూడా ఆమెపై అసంతృప్తితో రగులుతున్నారు.

ఇంటా బయటా అసంతృప్తే

గ్రేటర్ వరంగల్ లో మొత్తంగా 66 మంది కార్పొరేటర్లు ఉండగా, ఆమెపై అప్పుడు బీఆర్ఎస్ లో ఇప్పుడు కాంగ్రెస్ లో గుర్రుగా ఉన్న కార్పొరేటర్ల సంఖ్య ఎక్కువగానే ఉంది. ఈ రెండు పార్టీలకు తోడూ బీజేపీ కార్పొరేటర్లు కూడా ఆమెను గద్దె దించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ఉన్న మూడు పార్టీల కార్పొరేటర్లలో మెజారిటీ సభ్యులకు గుండు సుధారాణి మేయర్ గా కొనసాగడం ఇష్టం లేదనే విషయం స్పష్టమవుతోంది.

గ్రేటర్‌లో మొత్తం 66 డివిజన్లు ఉండగా, అందులో కాంగ్రెస్కు 35 మంది సభ్యుల బలం ఉండగా, బీఆర్ఎస్ 22, బీజేపీకి 9 మంది సభ్యుల బలం ఉంది. కాగా అవిశ్వాసం కోసం పాలకవర్గంలోని సగానికంటే ఎక్కువ మంది కార్పొరేటర్లు సంతకం పెట్టాల్సి ఉంటుంది. కానీ అవిశ్వాస తీర్మాన నోటీసులు ఇవ్వాలంటే సొంతంగా బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు సంఖ్యా బలం లేదు. దీంతోనే కాంగ్రెస్ పార్టీలోని కొందరు కార్పొరేటర్లను కూడా కలుపుకొని అవిశ్వాస తీర్మానం పెట్టాలనే యోచనలో కొందరు కార్పొరేటర్లున్నారు.

బహిరంగంగానే సమావేశం

ఎలాగైనా గుండు సుధారాణిని దించడంతో పాటు ఆ పదవిని దక్కించుకోవాలన్న ఆశతో ఉన్న కొందరు కార్పొరేటర్లు అవిశ్వాసానికి పావులు కదుపుతున్నట్లు తెలిసింది. ఈ మేరకు మంగళవారం మధ్యాహ్నం బీఆర్ఎస్, బీజేపీకి చెందిన దాదాపు 8 మంది కార్పొరేటర్లు అందరి ముందు బహిరంగంగానే సమావేశం అయ్యారు. తమకు ఉన్న బలంతో పాటు కలిసి వచ్చే కార్పొరేటర్లను కలుపుకుని తొందర్లోనే అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన లెటర్ అధికారులకు అందించనున్నట్లు తెలిసింది.

అందులో మేయర్ తో పాటు డిప్యూటీ మేయర్ ను కూడా ఆ పదవి నుంచి తప్పించాలనే ప్రయత్నం జరుగుతున్నట్లు తెలిసింది. ఈ నెల 20వ తేదీన సర్వసభ్య సమావేశం నిర్వహించేందుకు సెక్రటరీ విజయలక్ష్మీ ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేయగా, అదే సమావేశంలో కార్పొరేటర్లంతా కలిసి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలిసింది. ఇప్పటికే మేయర్ గుండు సుధారాణి పదవీ గండంతో గందరగోళంలో పడగా, రెండు, మూడు రోజుల్లో గ్రేటర్ రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటాయోననే చర్చ జరుగుతోంది.

(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)

Read Entire Article