Warangal : ఓరుగల్లులో హడలెత్తిస్తున్న చైన్ స్నాచర్లు.. బయటకు రావాలంటే జంకుతున్న మహిళలు

1 month ago 60
ARTICLE AD

వరంగల్ నగరంలోని మట్వాడాలో ఓదెల ప్రమీల అనే వృద్ధురాలు నివసిస్తోంది. శనివారం తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో ప్రమీల ఇంటి ముందు ముగ్గు వేస్తోంది. గమనించిన ఓ యువకుడు ఆమె మెడలో ఉన్న పుస్తెల తాడును తెంపుకునే ప్రయత్నం చేశాడు. ప్రమీల అడ్డుకునే ప్రయత్నం చేయగా.. ఆమెను నెట్టేసి అక్కడి నుంచి ఉడాయించాడు. ఆమె కింద పడిపోగా.. స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ఘటనా స్థలానికి ఏసీపీ..

చైన్ స్నాచింగ్ విషయం తెలిసిన వెంటనే వరంగల్ ఏసీపీ నందిరాం నాయక్, తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆ సమీపంలో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించే పనిలో పడ్డారు. గుర్తు తెలియని వ్యక్తి ఒకరు నడుచుకుంటూ వచ్చి చైన్ స్నాచింగ్‌కు పాల్పడగా.. కొంత దూరంలో బైక్ పై ఉన్న మరో వ్యక్తి ఆయనకు సహకరించినట్లు గుర్తించారు.

చైన్ స్నాచింగ్ అనంతరం ఇద్దరూ కలిసి బైక్ పై ఉడాయించినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఈ సందర్భంగా ఏసీపీ నందిరాం నాయక్ మాట్లాడుతూ.. చైన్ స్నాచింగ్ ఘటనల దృష్ట్యా మహిళలు అప్రమత్తంగా ఉండాలన్నారు. కాలనీల్లో ఎవరైనా అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

కత్తులతో బెదిరించి..

జనగామ జిల్లా కేంద్రంలో చైన్ స్నాచింగ్ వ్యవహారం కలకలం రేపింది. జిల్లా కేంద్రంలోని వీవర్స్ కాలనీకి చెందిన గుజ్జుల వీరస్వామి, లక్ష్మీ దంపతులు పట్టణ శివారులోని తమ వ్యవసాయ బావి వద్దకు వెళ్లారు. తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో ఇద్దరు గుర్తు తెలియని దుండగులు వారిని అడ్డగించారు. తమ వెంట తెచ్చుకున్న కత్తులతో బెదిరించి, వృద్ధురాలి మెడలో ఉన్న బంగారం ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశారు. వారు ప్రతిఘటించడంతో దాడికి పాల్పడ్డారు. అనంతరం వృద్ధురాలు లక్ష్మీ మెడలో ఉన్న మూడు తులాల బంగారం తీసుకుని పరారయ్యారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.

వైన్ షాప్‌లో చోరీ..

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఓ వైన్ షాపులో శుక్రవారం రాత్రి చోరీ జరిగింది. స్థానిక మంజునగర్ వద్ద ఉన్న కళ్యాణి వైన్ షాప్ నెంబర్-6 లో గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి.. రూ.45 వేల విలువైన మద్యం సీసాలు ఎత్తుకెళ్లారు. తమను గుర్తించకుండా ఉండేందుకు నిందితులు సీసీ టీవీ హార్డ్ డిస్క్‌ను కూడా తీసుకుని పరారయ్యారు. వైన్ షాప్ నిర్వాహకులు ఫిర్యాదు చేయడంతో శనివారం ఉదయం పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. నిందితులను తొందర్లోనే పట్టుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.

(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి)

Whats_app_banner

Read Entire Article