ARTICLE AD
WhatsApp Triple Talaq : తలాక్ తలాక్... తలాక్...అంటూ వాట్సాప్ ద్వారా వాయిస్ మెసేజ్ పంపిన సంఘటన ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జరిగింది. బాధితురాలు ఫిర్యాదు మేరకు నిందితుడిపై కేసు నమోదు చేశారు నేరవిభాగం పోలీసులు. సీఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం ఆదిలాబాద్ పట్టణంలోని కేఆర్కే కాలనీలో నివాసం ఉంటున్న అబ్దుల్ అతీక్ అదే కాలానికి చెందిన యువతిని వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు సంతానం కూడా ఉన్నారు. పెళ్లి అయినా నాటి నుంచి వీరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. అదనపు కట్నం కోసం వేధించడంతో మహిళ భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలికి పిల్లల సంరక్షణ కోసం ఖర్చులు చెల్లించాలని కోర్టు తీర్పు ఇచ్చింది. ఇదిలా ఉండగానే భర్త మరొకరిని వివాహం చేసుకుని పట్టణంలోని మరొక కాలనీలో నివాసం ఉంటున్నాడు. ఈ మేరకు ఈ నెల 11న నేను నీకు తలాక్ ఇస్తున్నాను అంటూ మొదటి భార్యకు వాట్సాప్ ద్వారా తలాక్... తలాక్... తలాక్... అంటూ వాయిస్ మెసేజ్ పంపించాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.
ముస్లిం మహిళల (వివాహంపై హక్కుల పరిరక్షణ) చట్టం ప్రకారం "ట్రిపుల్ తలాక్"తో తక్షణం విడాకులు తీసుకునే పద్ధతిని నేరంగా పరగణిస్తారు. ఈ కేసులో నిందితుడిని అరెస్టు చేసి, జ్యుడీషియల్ కస్టడీకి రిమాండ్‌కు పంపుతామని ఎస్‌ఐ శ్రీనివాస్ తెలిపారు. ట్రిపుల్ తలాక్ పై కేసు ఆదిలాబాద్‌లో ఇదే మొదటిదన్నారు. ఇంతకుముందు వేధింపుల ఆరోపణలతో పాటు ఈ సెక్షన్ జోడించి రెండు కేసులను నిందితుడిపై నమోదు చేశామన్నారు.
ట్రిపుల్ తలాక్ ఘటన వ్యక్తి అరెస్ట్
ఈ ఏడాది ప్రారంభంలో నవీ ముంబయిలో 43 ఏళ్ల వ్యక్తి ఖార్ఘర్‌లోని ఒక కళాశాలలో పనిచేస్తున్న తన భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పాడనే ఆరోపణలను ఎదుర్కొంటున్నాడు. మహిళ ఫిర్యాదుతో మేరకు ఖార్ఘర్ పోలీసులు ముస్లిం మహిళల (వివాహంపై హక్కుల పరిరక్షణ) చట్టం, 2019 కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇంకా ఎవరినీ అరెస్టు చేయలేదు.
Reporting : Kamoji venugopal, HT Adilabad