జీవన్ రెడ్డిని తప్పించాలని చూస్తున్నదెవరు? ఉమ్మడి జిల్లాలో చర్చ

5 months ago 90
ARTICLE AD

జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కారు దిగి కాంగ్రెస్ పార్టీలో చేరడం కాంగ్రెస్ పార్టీలో కాక పుట్టించింది. సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి సమాచారం లేకుండా ఎమ్మెల్యేను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడంతో జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. జీవన్ రెడ్డి తోపాటు ఆయన అనుచరులను ఆందోళనకు గురి చేసింది. తీవ్ర అసంతృప్తితో అసహనం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రాజీనామాకు సిద్ధమయ్యారు. పరిస్థితిని గమనించిన పార్టీ పెద్దలు జీవన్ రెడ్డిని సముదాయించే పనిలో నిమగ్నమయ్యారు. మంత్రి శ్రీధర్ బాబును దూతగా పంపి జీవన్ రెడ్డి తో చర్చలు జరిపారు.

గుట్టు చప్పుడు కాకుండా బిఆర్ఎస్ కు చెందిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరడం కాంగ్రెస్ పార్టీలో కలకలం సృష్టించింది. ఎమ్మెల్యే కాంగ్రెస్ లో చేరిన విషయం తెలియగానే కార్యకర్తలు పెద్ద ఎత్తున జగిత్యాలలో జీవన్ రెడ్డి ఇంటికి చేరుకొని పార్టీ తీరును ఎమ్మెల్యే చేరికను వ్యతిరేకిస్తూ నిరసన తెలిపారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అండగా తీవ్ర అసహనంతో ఊగిపోయారు. పార్టీ సీనియర్ నేతను పెద్దలు గుర్తించకపోవడం పై ఆగ్రహం వ్యక్తం చేస్తు కాంగ్రెస్ కు రాజీనామా చేయాలని జీవన్ రెడ్డిపై ఒత్తిడి తీసుకొచ్చారు. జీవన్ రెడ్డి కార్యకర్తలను సముదాయించినా ప్రయోజనం లేకపోవడంతో ఒక దశలో రాజీనామాకు సిద్దమయ్యారు.

జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తి, కార్యకర్తల ఆందోళన పరిస్థితి సీరియస్ గా మారడంతో పార్టీ పెద్దల ఆదేశం మేరకు మంత్రి శ్రీధర్ బాబు జగిత్యాలలో జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లారు. జీవన్ రెడ్డితో మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు భేటీ అయ్యారు. ఒక దశలో కార్యకర్తలు ఎమ్మెల్యే చేరికకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కన్నీటి పర్యంతం అవుతూ జీవన్ రెడ్డికి అన్యాయం చేయొద్దని మంత్రి శ్రీధర్ బాబు కాళ్ళు మొక్కి వేడుకున్నారు. 

జరిగిన పరిణామాలపై జీవన్ రెడ్డితో దాదాపు గంట పాటు మంత్రి శ్రీధర్ బాబు చర్చించారు. కాంగ్రెస్ పార్టీకి పెద్దదిక్కు జీవన్ రెడ్డి అని, ఆయన గౌరవానికి ఇబ్బంది లేకుండా చూస్తామని శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు. జీవన్ రెడ్డి ఎప్పుడూ మాకు పెద్దదిక్కుగా ఉండాలని కోరారు. కార్యకర్తల మనోభావాలను, జీవన్ రెడ్డి పడ్డ కష్టాలను కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుందని తెలిపారు. జగిత్యాల కాంగ్రెస్ నాయకుల కార్యకర్తల అభిప్రాయాన్ని ‌సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర కాంగ్రెస్ ఇన్చార్జి దీపాదాస్ మున్షీ, కేసి వేణుగోపాల్, ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ పక్షాన తప్పకుండా జీవన్ రెడ్డి కి న్యాయం చేసే బాధ్యత తీసుకుంటామని శ్రీధర్ బాబు చెప్పారు.

భవిష్యత్తును కాలమే నిర్ణయిస్తుంది: జీవన్ రెడ్డి

సమాచారం లేకుండా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తనదైన శైలిలో స్పందించారు. మంత్రి శ్రీధర్ బాబుతో జరిగిన పరిణామాలపై చర్చించామని, అసంతృప్తిపై కాదని స్పష్టం చేశారు. దశాబ్ద కాలంగా కాంగ్రెస్ పార్టీ అభ్యున్నతి కోసం కృషి చేసిన కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నాయని తెలిపారు. ప్రభుత్వానికి అండగా ఉండేందుకు ఇతర పార్టీల ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవడం బాగానే ఉన్నా, స్థానిక సీనియర్ నేత అయిన తనకు సమాచారం ఇవ్వకపోవడాన్నే తప్పుపడుతున్నామని తెలిపారు. సమాచారం ఇవ్వకపోవడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటని ప్రశ్నిస్తున్నామని చెప్పారు. కార్యకర్తల మనోభావాలను గౌరవించవలసిన బాధ్యత పార్టీపై ఉందన్నారు. భవిష్యత్తు ఎలా ఉంటుందో కాలమే నిర్ణయిస్తుందని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు.

సమాచారం ఎందుకు ఇవ్వలేదు?

ఉమ్మడి జిల్లాలో, ముఖ్యంగా జగిత్యాలలో పార్టీకి విశేష సేవలు అందించిన జీవన్ రెడ్డి ఒక దశలో పీసీసీ అధ్యక్ష పదవికి కూడా అర్హుడిగా శ్రేణులు భావించాయి. ఆయనకు ఉన్న అనుభవం, ప్రజాధరణ కారణంగా పార్టీ అడిగినప్పుడు కరీంనగర్, నిజామాబాద్ ఎంపీ స్థానాలకు కూడా పోటీ చేశారు. ఇన్నాళ్లూ బీఆర్ఎస్‌పై పోరాడుతూ వచ్చిన నాయకుడికి.. ఉన్నపళంగా ఎమ్మెల్యే సంజయ్‌ను చేర్చుకునే విషయమై ఒక్క మాట కూడా చెప్పకపోవడాన్ని శ్రేణులు జీర్ణించుకోవడం లేదు. తమ ఎదుగుదలకు ఎక్కడ అడ్డొస్తారని భయపడి కొందరు నేతలు ముందుచూపుతోనే జీవన్ రెడ్డి స్థాయిని తగ్గించాలని చూస్తున్నారని, పార్టీ నుంచి తప్పించాలని చూస్తున్నారని పార్టీ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. 

HT తెలుగు ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ కె.వి.రెడ్డి
Read Entire Article