ARTICLE AD
వాతావరణ ప్రతికూల పరిస్థితులకు తోడు దేశవ్యాప్తంగా తగ్గిన కూరగాయల సాగుతో వేసవికాలం ముగిశాక కూరగాయల ధరలు అమాంతం పెరిగాయి. కూరగాయల ధరల పెరుగుదలతో సామాన్యుడిపై పెనుబారం పడుతోంది. పేద మధ్యతరగతి జీవితాల్లోకన్నీళ్లు తెప్పిస్తున్నాయి.
సాధారణంగా వేసవిలో కాయగూర ధరలు పెరిగే అవకాశం ఉండగా ఈసారి వేసవి ముగిసిన తర్వాత ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని అంటాయి. దీంతో నిరుపేదల జీవితాలు సతమతమవుతున్నాయి. అసలే ఆదాయం పెరుగక ఖర్చులు పెరుగుతున్న తరుణంలో కూరగాయల ధరలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి.
15 రోజుల్లోనే మూడింతలు
గత 15 రోజుల్లో కూరగాయల ధరల మూడు రెట్లు పెరిగాయి. టమాటా, ఉల్లిగడ్డ, ఆలుగడ్డలు, పచ్చిమిర్చి, బీన్స్, చిక్కుడు, బెండకాయ, బీరకాయతో పాటు ఏ కాయగూర చూసినా రూపాయలు రెండువందలకు కిలో ధరలు పలుకుతున్నాయి.
డిమాండ్‌కు తగ్గ కూరగాయల సరఫరా లేకపోవడంతో విక్రయదారులు ధరలను అమాంతం పెంచేస్తున్నారు. బహిరంగ మార్కెట్లో 30 నుంచి 50% వరకు ధరలు అధికంగా ఉంటున్నాయి. కిలో టమాట 80 రూపాయలు, ఆలుగడ్డ 80 రూపాయలు, పచ్చిమిర్చి 150 రూపాయలు, బీన్స్ 150 రూపాయలు బీరకాయలు రూ. 200, కిలో, క్యారెట్ రూ. 150 రూపాయలు, ఆకుకూరలు రెండు కట్టలు 20 రూపాయలు ధరలకు విక్రయిస్తున్నారు.
అసలే అరకొర సంపాదనతో బతుకు బండి నడిపిస్తున్న పేద మధ్యతరగతి వారికి బడ్జెట్ అదుపుతప్పుతోంది. మహారాష్ట్రలో వచ్చిన కరువు పరిస్థితుల్లో ఉల్లిగడ్డ, ఆలుగడ్డ పంట దిగుబడి లేక ధరల మాత్రం పెరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. మరోవైపు పండుగ సీజన్ వస్తుండడంతో కొంతమంది హోల్ సేల్ వర్తకులు ఉల్లి, ఆలుగడ్డలకు కృత్రిమ కొరత సృష్టిస్తున్నట్టు రీటైల్ వర్తకులు చెబుతున్నారు.
పావు కిలోతో సరి
వంటింట్లో డైలీ అవసరమయ్యే కూరగాయలు గతంలో కిలో తీసుకునేవారు కేవలం పావు కిలో తోనే సరిపెట్టుకుంటున్నారు. క్యారెట్ క్యాబేజీ క్యాప్సికం తో పాటు పుదీనా, కొత్తిమీర తదితర ఆకుకూరలు కూడా రెట్టింపు ధరలు అయ్యాయి. ఇలా ఉంటే రాబోయే రెండు నెలల వరకు ధరలు ఇదేవిధంగా ఉండే అవకాశం ఉందని స్థానిక వ్యాపారులు అంటున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ధరల నియంత్రణను చూసే అధికారులు తక్షణం స్పందించి పేద సామాన్య ప్రజలను ఆదుకునేలా చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
రిపోర్టింగ్: కామోజీ వేణుగోపాల్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రతినిది