రాజకీయ కక్షతోనే నాపై ఈడీ దాడులు - బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి

5 months ago 97
ARTICLE AD

ED Raids Patancheru MLA Mahipal Reddy :  పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి,ఆయన సోదరుడు మధుసూదన్ రెడ్డి, ఇంటితో పాటు ఆయన బంధువుల నివాసాలపై గురువారం ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఏకకాలంలో దాడులు నిర్వహించింది. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన ఈ దాడులు రాత్రి 7గంటల వరకు కొనసాగాయి. 

ఈ క్రమంలో ఈడీ అధికారులు బృందాలుగా విడిపోయి మహిపాల్ రెడ్డి, మధుసూదన్ రెడ్డితో పాటు మైనింగ్ కి సంబంధించిన కార్యాలయాలు,బంధువుల ఇళ్లల్లో ఏక కాలంలో సోదాలు నిర్వహించారు. అక్రమ మైనింగ్,పెద్ద ఎత్తున భూ అక్రమాలకు పాల్పడ్డారని భూ అక్రమాలకు పాల్పడ్డారన్న అభియోగాలతో ఈ దాడులు నిర్వహించారని తెలుస్తోంది. మహిపాల్ రెడ్డి ఇంట్లో సోదాలు జరిపిన ఈడీ అధికారులు ఆర్ధిక లావాదేవీలకు సంబంధించిన పత్రాలను పరిశీలించారు. మహిపాల్ రెడ్డితో పాటు కుటుంబసభ్యులను విడివిడిగా ప్రశ్నించారు. ఈడీ అధికారులు 10 గంటలకు పైగా నిర్వహించిన సోదాల తర్వాత రెండు నివాసాల నుండి ఏమి స్వాధీనం చేసుకోలేదని చెప్పారు. కాగా వారి ఇళ్లల్లో దొరికిన వివిధ పత్రాలను, డిజిటల్ డివైజ్ లను సేకరించారు .

రాజకీయకక్షతోనే ఈడీ దాడులు ......

తనను రాజకీయంగా ఎదుర్కోలేక కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కక్ష పూరితంగా ఈడీ ,ఐటీ దాడులు చేయిస్తున్నట్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆరోపించారు. ఈడి సోదాలు ముగిసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈడీ అధికారులు జరిపిన సోదాలకు తాను,తన కుటుంబసభ్యులు పూర్తిగా సహకరించామని తెలిపారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఎటువంటి వ్యాపారాలు నిర్వహించలేదని తెలిపారు. అధికారులు జరిపిన 12 గంటల సోదాల్లో బంగారం కానీ నయా పైసా లభించలేదన్నారు. కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా సోదాలు ముగిశాయని తెలిపారు. 

లొంగదీసుకునే ప్రయత్నం చేస్తున్నారు: హరీష్ రావు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు… బీఆర్ఎస్ నాయకులను బెదిరించి లొంగదీసుకునే ప్రయత్నం చేస్తున్నాయని మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన పటాన్ చెరులోని గూడెం మహిపాల్ రెడ్డి సోదరులను కలిశారు. గురువారం వారి ఇళ్లల్లో జరిగిన ఈడి అధికారుల తనిఖీల గురించి అడిగి తెలుసుకున్నారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారుంలో ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఈడీ,ఐటీ దాడులతో వేదిస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇంట్లో ఏలాంటి అవినీతి ఆస్తులు దొరకలేదన్నారు. బిహార్, గుజరాత్ లలో నీట్ ప్రశ్నాపత్రాలను అమ్ముకున్నారని ఆరోపించారు. ప్రశ్నాపత్రాలు లీకవుతున్నా అక్కడ ఈడీ అధికారులు ఎందుకు వారిపై దాడులు చేయటం లేదని మండిపడ్డారు. 

రాష్ట్రంలో లక్ష కుటుంబాల పిల్లలు నీట్ పరీక్ష రాశారని , వారిభవిష్యత్తు అయోమయంలో ఉందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బిఆర్ఎస్ ఎమ్మెల్యే లను ఒత్తిడికి గురి చేస్తూ వారి ఇళ్ల చుట్టూ తిరుగుతూ బెదిరింపులకు పాల్పడుతున్నారని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేసారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి చాలా ధైర్యంగా ఉన్నారని,వారు ఏలాంటి తప్పు చేయలేదని తెలిపారు. తమకు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉందని ధర్మం గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

రిపోర్టింగ్ - మెదక్ జిల్లా ప్రతినిధి, HT తెలుగు.

Read Entire Article