ARTICLE AD
తెలుగు న్యూస్ / తెలంగాణ / విద్యుత్ కమిషన్ ఏర్పాటు చట్టవిరుద్ధం - హైకోర్టులో కేసీఆర్ పిటిషన్
KCR approaches TG High court : విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్… హైకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్‌ను రద్దు చేయాలని కోరారు. న్యాయసూత్రాలకు విరుద్ధంగా కమిషన్ ఏర్పాటైందని తన పిటిషన్ లో ప్రస్తావించారు.
హైకోర్టును ఆశ్రయించిన కేసీఆర్
KCR approaches Telangana High court : తెలంగాణ విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంలో మరో పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే విద్యుత్ కమిషన్ (జస్టిస్ నర్సింహ్మా రెడ్డి) నుంచి నోటీసులు అందుకున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్…. విచారణకు హాజరుకాలేదు.
విచారణకు హాజరుకాని కేసీఆర్… ఇటీవలే కమిషన్ కు 12 పేజీలతో కూడిన లేఖను రాశారు. ఇదిలా ఉంటే ఆయన తాజాగా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. రాష్ట్ర విద్యుత్ శాఖ మార్చి 14న జారీ చేసిన జీవో.. విచారణ కమిషన్ల చట్టానికి, విద్యుత్తు చట్టానికి విరుద్ధమని పేర్కొంటూ కేసీఆర్ మంగళవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ కు విచారణార్హత లేదని తన పిటిషన్ లో ప్రస్తావించారు. న్యాయసూత్రాలకు విరుద్ధంగా కమిషన్ ఏర్పాటైందని… అలాంటి కమిషన్ ఏర్పాటును రద్దు చేయాలని కోరారు. విద్యుత్తుపై విచారించే పరిధి ఎస్‌ఈఆర్సీకి మాత్రమే ఉంటుందని తన పిటిషన్ లో ప్రస్తావించారు.
కమిషన్ ఏర్పాటు చట్ట విరుద్ధంగా ఉందని కేసీఆర్ తన పిటిషన్ లో పేర్కొన్నారు. విచారణ కమిషన్ల చట్టం-1952లోని నిబంధనలతో పాటు విద్యుత్ చట్టం - 2023లో పేర్కొన్న నిబంధనలకు విరుద్ధంగా కమిషన్ ఏర్పాటైందని వివరించారు. కమిషన్ నుంచి జారీ అయిన లేఖలను పక్కనపెట్టాలని కోరారు.
సమగ్ర వివరాలతో కమిషన్ కు లేఖ రాసినట్లు కేసీఆర్ తన పిటిషన్ లో తెలిపారు. ఛైర్మన్‌గా జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి కొనసాగడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. నోటీసులకు బదులిస్తూ లేఖ రాసిన తరువాత కూడా తమ ఎదుట హాజరై ఆధారాలను సమర్పించాలంటూ కమిషన్ మరోసారి జూన్ 19న ప్రోసీడింగ్స్ ను జారీ చేసిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
ఇంధనశాఖ ముఖ్యకార్యదర్శి, విచారణ కమిషన్, వ్యక్తిగత హోదాలో కమిషన్ ఛైర్మన్ జస్టిస్ ఎల్.నరసింహారెడ్డిని ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ పిటిషన్ ప్రస్తుతం హైకోర్టు రిజిస్ట్రీ పరిశీలనలో ఉంది. కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్ ఒకటి రెండు రోజుల్లో కోర్టు ముందుకు వచ్చే అవకాశం ఉంది.
ఇటీవలే రెండో లేఖ…
విద్యుత్ కొనుగోళ్లపై మాజీ సీఎం కేసీఆర్ కు జూన్ 19న జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ మరోసారి లేఖ రాసింది. విద్యుత్ కొనుగోళ్ల అంశంపై మరింత సమాచారం ఇవ్వాలని తెలిపింది. యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంపై మరిన్ని వివరాలు తెలియజేయాలని పేర్కొంది. ఛత్తీస్‌గఢ్ నుంచి కొన్న విద్యుత్ గురించి మరింత సమాచారం కోరింది. వీటిపై జూన్ 27 లోపు సమాధానమివ్వాలని లేఖలో ప్రస్తావించింది.
విద్యుత్ కోనుగోళ్ల వ్యవహారంపై విచారణ జరుపుతున్న జస్టిస్ నర్సింహ్మా రెడ్డి కమిషన్… మొదటిసారి జూన్ 15వ తేదీని గడువుగా పేర్కొంటూ కేసీఆర్ కు నోటీసులు ఇచ్చింది. కమిషన్ ముందు హాజరై వివరాలను ఇవ్వాలని కోరింది. దీనికి నిరాకరించిన కేసీఆర్… జూన్ 15వ తేదీన 12 పేజీలతో కూడిన లేఖను పంపారు.
ఈఆర్ సీలు వెలువరించిన తీర్పులపై ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు చేయటం చట్ట విరుద్ధమని లేఖలో కేసీఆర్ ప్రస్తావించారు. ఈ విషయాన్ని ప్రభుత్వానికి సూచిచకుండా బాధ్యతలు స్వీకరించటం విచారకమన్నారు.
చట్టవిరుద్ధంగా విచారణ ప్రారంభించి... అనేక విషయాలను సమగ్రంగా పరిశీలించకుండానే జూన్ 11వ తేదీన మీడియా సమావేశంలో అసంబద్ధమైన వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు.
కమిషన్ వ్వవహరిస్తున్న తీరు సహజ న్యాయసూత్రాలకు విరుద్ఘంగా ఉందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. మీ విచారణలో నిష్పాక్షికత లేదని… ఎంక్వైరీ బాధ్యతల నుంచి స్వచ్ఛదంగా తప్పుకోవాలని కోరుతున్నట్లు లేఖలో కేసీఆర్ ప్రస్తావించారు.
విచారణ పూర్తికాకముందే తీర్పు ప్రకటించినట్టుగా కమిషన్ మాటలున్నాయని కేసీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. మీ విచారణలో నిష్పాక్షికత ఎంత మాత్రం కనిపించడం లేదని…. అందువల్ల ఇప్పుడు నేను మీ ముందు హాజరై ఏం చెప్పినా ప్రయోజనం ఉండదని స్పష్టం అవుతోందని రాసుకొచ్చారు. లేఖలో పేర్కొన్న అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని మీరు ఈ ఎంక్వైయిరీ కమిషన్ బాధ్యతల నుంచి స్వచ్ఛందంగా వైదొలగాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నట్లు కోరారు.