సాగులో పెరిగిన యాంత్రీకరణ... డ్రోన్లతో యువతకు ఉపాధి

5 months ago 94
ARTICLE AD

ఒకప్పుడు దుక్కి దున్నాలన్నా, విత్తనాలు వేయాలన్నా, ఎరువులు చల్లాలన్నా, కలుపు తొలగించాలన్న ప్రతి పని ని రైతులు కూలీలు చేసుకునేవారు. లేదా ఒకరికొకరు పరస్పరం అవగాహనతో పనులు కానిచ్చేవారు. కానీ ప్రస్తుతం ట్రెండు మారింది. ప్రతి పనిని సమయం, డబ్బు వృథా చేయకుండా రైతులు వినూత్న రీతిలో వ్యవసాయం చేసుకుంటున్నారు. 

ఆధునిక వ్యవసాయ పద్ధతులు అవలంబిస్తూ, యాంత్రికరణతో ముందుకు సాగుతున్నారు. రాను రాను హైటెక్ కాలంలో కూలీల కొరత కారణంగా సకాలంలో ఎరువులు, విత్తనాలు అలకడానికి యంత్రాలను ఉపయోగిస్తూ డబ్బును సమయాన్ని ఆదా చేసుకుంటున్నారు.

సమయం డబ్బు ఆదా...

వానకాలం సాగు మొదలైంది. అడపాదడప వర్షాలు పడుతుండడంతో రైతులు పొలం బాట పడుతున్నారు. దుక్కి దున్నడం మొదలుకొని విత్తనాలు వేయడం, ఎరువులు వేయడం, కలుపులు తీయడం వరకు గతంలో కూలీలతో చేసే పనిని యంత్రాలతో చేస్తున్నారు. కూలి రేట్లు పెరగడంతో రైతులు యంత్రాల పైన దృష్టి సారిస్తున్నారు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో యాంత్రీకరణ క్రమక్రమంగా పెరుగుతోంది. యాంత్రీకరణ లేక ముందు రైతులు ఎవరు ఎద్దులతో వారు అరకతోనే అన్ని రకాల విత్తనాలు వేసేవారు. ఎకరం పొలంలో విత్తనాలు నాటడానికి కనీసం ముగ్గురు నుంచి నలుగురు కూలీలు, అరక అవసరమయ్యేది. అయితే కూలి రేట్లు పెరగడంతో రైతులు యంత్రాలతో పనులు చేయిస్తున్నారు. 

ఒక్కో కూలీకి రోజుకు విత్తనాలు వేయడానికి రూ. 300 నుంచి రూ. 400, అరక మనిషికి రూ. 1000, ఎద్దులకు రోజుకు 3000 కిరాయి ఉంది. మొక్కజొన్న సాగుకు ఎకరానికి విత్తనాలు వేయడానికి రూ. 4,000 నుంచి రూ. 5,000 వరకు అవుతున్నాయి. 

అదేవిధంగా పసుపుకు రూ. 5000 నుంచి రూ. 7,000 వరకు అవుతున్నాయి. కానీ అదే ఎకరం మొక్కజొన్న విత్తనాలు ట్రాక్టర్ తో వేయడానికి రూ. 2000, పసుపు వేయడానికి రూ. 3500 ఖర్చు మాత్రమే అవుతున్నాయి. దీంతో సమయం తగ్గడంతో పాటు సాగు ఖర్చులు కూడా సగానికి తగ్గుతున్నాయని రైతులు చెబుతున్నారు.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో మినహా మైదానంలో రైతులంతా ట్రాక్టర్లు డ్రోన్లు,తదితర యంత్రాలపైనే వ్యవసాయం చేస్తున్నారు. అన్ని రకాల విత్తనాలు యంత్రాలతోనే నాటుతున్నారు.

పంట పొలాల్లో డ్రోన్ సేద్యం..

పంట పొలాల్లో పురుగుల మందుల పిచికారి, ఎరువులు చల్లడం, విత్తనాలను వేయడం వంటి తదితర పనులకు రైతులు డ్రోన్లను వినియోగిస్తున్నారు. సేద్యానికి కూలీల కొరత ప్రధాన సమస్యగా మారిన తరుణంలో దాన్ని అధిగమించేందుకు అన్నదాతలు డ్రోన్లు ఉపయోగిస్తున్నారు. 

ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో కొందరు యువకులు వ్యవసాయంపై అవగాహన కోసం హైదరాబాదు లాంటి పట్టణ ప్రాంతాల్లో శిక్షణ పొంది డ్రోన్లు కొనుగోలు చేసుకుని ఆయా గ్రామాల్లో రైతులకు సేద్యం అందిస్తూ ఉపాధి పొందుతున్నారు. 

వారం రోజుల శిక్షణ తీసుకున్న అనంతరం ఐదు లక్షలతో డ్రోన్లు కొనుగోలు చేసి పంట పొలాల యజమానులకు సంప్రదించి పురుగు మందు పిచికారి కోసం కిరాయిలకు ఇస్తున్నారు. డ్రోన్ల ద్వారా సమయంతో పాటు పురుగుమందులు వృధా కాకుండా ఉంటాయని రైతు గంగారెడ్డి చెప్పారు.

చేతి పంపు ద్వారా పిచికారి చేస్తే ఎకరానికి అయ్యే ఖర్చులలో డ్రోన్ ద్వారా పిచికారి చేస్తే సుమారు రూ. 1000 ఆదా అవుతాయని, 20 నిమిషాలలో ఎకరం పొలానికి పురుగుమందు పిచికారి చేయవచ్చు అని అన్నారు. జామ, నిమ్మ, దానిమ్మ, మామిడి, మునగ తదితర ఎత్తయిన పంటలకు డ్రోన్లు చాలా ఉపయోగపడతాయని రైతులు చెబుతున్నారు.

రిపోర్టింగ్ : వేణుగోపాల్ కామోజీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధి, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు

Read Entire Article